Uttarakhand Tour: దేవభూమి ఉత్తరాఖండ్ యాత్ర, విశాఖపట్నం నుంచి భరత్ గౌరవ్ మానస్‌ఖండ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
26 June 2024, 6:28 IST
- Uttarakhand Tour: విశాఖపట్నం నుంచి దేవభూమి ఉత్తరాఖండ్ యాత్రకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రలో అనేక అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు.
ఉత్తరాఖండ్ పర్యాటక ప్రాంతాల కోసం ఐఆర్‌సిటిసి ప్రత్యేక రైలు
Uttarakhand Tour: పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి విశాఖపట్నం నుంచి భరత్ గౌరవ్ మానస్ ఖండ్ స్పెషల్ ట్రైన్ పర్యాటకుల కోసం నడుపుతోంది. యాత్రికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ కోరింది. ఈ యాత్రను ఐఆర్‌టీసీసీ, ఉత్తరాఖండ్ టూరిజం డవలప్‌మెంట్ బోర్డు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
భరత్ గౌరవ్ మానస్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను ఉత్తరాఖండ్ యాత్ర కోసమే అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు ప్రయాణం విశాఖపట్నంలో బయలుదేరి, ఉత్తరాఖండ్‌లోని కత్గోడంకు చేరుకుంటుంది. మళ్లీ తిరిగి ప్రయాణం కత్గోడం నుంచి విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్, ఇటార్సి, భోపాల్ బోర్డింగ్ స్టేషన్లు ఉన్నాయి.
విశాఖపట్నంలో 26 (బుధవారం)న మధ్యాహ్నం 2 గంటలకు రైలు బయలుదేరుతోంది. మూడో రోజు 28న ఉదయం 8 గంటలకు కత్గోడం చేరుకుంటుంది. 11 రోజులు, పది రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతోంది. తొమ్మిదో రోజు జూలై 3న రాత్రి 8 గంటలకు కత్గోడం రైల్వే స్టేషన్ నుంచి రైలు తిరిగి ప్రయాణం ప్రారంభం అవుతుంది. జూలై 5న మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ప్యాకేజీ ప్రామాణిక ధర ఒక్కొక్కరికి రూ.28,020గా, అదే డీలక్స్ ధర ఒక్కొక్కరికి రూ.35,340గా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. భోజనం సదుపాయం కూడా ఉంటుంది. 300 ఏసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. టిక్కెట్టును ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ Book Now : https://www.irctctourism.com/bharatgauravలో బుక్ చేసుకోవాలి.
ఈ యాత్రలో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీ ప్రాంతంలోని కత్గోడం, భీమ్తాల్ (రెండు రాత్రులు) ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాల్లోని పర్వత ప్రాంతం అల్మోరా (రెండు రాత్రులు), ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలోని కౌసని (రెండు రాత్రులు), అల్మోరా జిల్లాలోని రాణిఖేత్ కూడా రైలు ఆగుతోంది. ప్రముఖ ప్రదేశాలు, తీర్థయాత్రలు కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతోంది.
సందర్శించే పర్యటక, పుణ్యక్షేత్ర స్థలాలు
ఈ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని 11 పర్యటక, పుణ్యక్షేత్ర స్థలాలను సందర్శిస్తారు. భీమ్తాల్, నైనిటాల్ (నైనా దేవి ఆలయం, నైని సరస్సు), కైంచి ధామ్ (బాబా నీమ్ కరోలి ఆలయం), కసర్ దేవి, కతర్మల్ సూర్య దేవాలయం, జగేశ్వర్ ధామ్, గోలు దేవత (చిత్తై), అల్మోరా (నందా దేవి ఆలయం), బైజ్నాథ్, బాగేశ్వర్, కౌసని, రాణిఖేత్ ప్రాంతాలను సందర్శిస్తారు.
ఈ ప్యాకేజీకి సంబంధించిన అదనపు సమచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZUBG07ను సంప్రదించాలి. అలాగే పోన్ నంబర్లు విశాఖపట్నం, రాజమండ్రి-9281030748, విజయవాడ-9281495847, వరంగల్-9550166168, 9281495847, సికింద్రాబాద్-9281436280 కూడా సంప్రదించవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)