తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రకృతిచేసిన అందాల మాయ.. అరకులోయ! ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకును ఇలా చేరుకోవచ్చు

ప్రకృతిచేసిన అందాల మాయ.. అరకులోయ! ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకును ఇలా చేరుకోవచ్చు

Manda Vikas HT Telugu

28 December 2021, 16:44 IST

google News
    • అపారమైన ప్రకృతి సౌందర్యాలకు నెలవైన అరకును ప్రతి ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. ఇక్కడి ప్రకృతి రమణీయత, అద్భుతమైన గిరిజన సంస్కృతి మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
undefined
undefined

undefined

ఎటుచూసినా పచ్చని కొండలు, ఆ కొండలపై గట్లుగట్లుగా నాట్లు, మేఘాలు కిందకి దిగి వచ్చాయా అన్నట్లుగా కమ్ముకునే పొగమంచు, జలజల జాలువారే జలపాతాలు, గలగల పారే సెలయేళ్లు, దారిపొడుగునా కాఫీతోటల ఘుమఘుమలు, నోరూరించే వెదురు బొంగు రుచులు. ఇది అరకులోయ అందించే అందాల విందు. అపారమైన ప్రకృతి సౌందర్యాలకు నెలవైన అరకును ప్రతి ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. 

ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం

ఇక్కడి ప్రకృతి రమణీయత, అద్భుతమైన గిరిజన సంస్కృతి మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అద్భుతమైన వాతావరణంతో విరాజిల్లుతున్న అరకు లోయ దేశంలోని నలుమూలల నుండి యాత్రికులను, హనీమూన్ జంటలను, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్లను ఇష్టపడే సాహస ప్రియులను ఆకర్షిస్తున్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది.

సముద్ర మట్టానికి 911 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన హిల్ స్టేషన్, విశాఖపట్నం నుంచి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో నవంబర్ నుంచి జనవరి మాసాలలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ఎలా చేరుకోవచ్చు?

వైజాగ్ నుంచి అరకుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం, ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తుంది. పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రెంటల్ బైక్స్, కార్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ఇవే కాకుండా ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో కూడా చేరుకోవచ్చు. ప్రయాణ సమయం సుమారుగా 3 నుంచి 4 గంటలు పడుతుంది.

ఏపి టూరిజం ప్యాకేజ్ ఒకరోజులోనే పూర్తవుతుంది. ఉదయం 7 గంటలకు వైజాగ్ నుంచి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి రోడ్డు మార్గంలో అరకు తీసుకెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు చూపించి, సాయంత్రం ట్రైబల్ మ్యూజియం, అందులోనే గిరిజన ప్రత్యేక నృత్యం ధిమ్సా డ్యాన్స్ చూపించడంతో ఈ పర్యటన ముగుస్తుంది. రాత్రి 9 గంటల వరకు తిరిగి వైజాగ్ చేరుస్తారు.

ఐఆర్ సీటీసీ ప్యాకేజ్

అరకుకు రోడ్డు మార్గం కంటే రైలు మార్గంలో వెళ్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే రైలులో అరకు లోయకు వెళ్లే ప్రయాణ సొరంగాలు, తూర్పు కనుమల ఒంపుసొంపులు, కొండలపై వంతెనలు, వాగులు, జలపాతాలతో మీ ప్రయాణంలో మరింత జీవం నింపుతుంది. అంతేకాకుండా యాత్రికులకు మరపురాని అనుభూతులు పొందేలా రైల్వేశాఖ విశాఖ- అరకు మార్గంలో నడిచే రైలును విస్టాడోమ్ కోచ్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. దీంతో యాత్రికులు 360-డిగ్రీలలో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. రైలు ప్రయాణం ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో ఇక్కడి మిగతా పర్యాటక ప్రదేశాలను చూసేందుకు, ఇక్కడే బస చేసేందుకు ఐర్ సీటీసీ ఇటీవల సరికొత్త ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టింది.

అరకులో బస చేయడం ఎక్కడ

ఏపిటీడీసీకి చెందిన అద్భుతమైన హరిత రిసార్టులతో పాటు, మరెన్నో ప్రైవేట్ కాటేజీలు చాలా అందుబాటులో ఉన్నాయి. కనీసం ఇక్కడ రెండు రోజుల పాటు బస చేస్తే ఎన్నో మధురానుభూతులు సొంతమవుతాయి.

అరకు లోయలో ప్రధానంగా గిరిజనులు నివసిస్తున్నారు. గిరిజన మ్యూజియం ఇక్కడ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది గిరిజన హస్తకళలు, వారి జీవనశైలిని వర్ణించే అనేక కళాఖండాలను కలిగి ఉంది. రంగురంగుల వేషధారణలతో గిరిజనులంతా కలిసి చేసే ధిమ్సా అనే నృత్యాన్ని అరకుకు వచ్చే సందర్శకులందరూ తప్పక చూడాల్సిందే.

అరకు కాఫీ తోటలకు కూడా ప్రసిద్ది చెందింది. భారతదేశంలోనే మొట్టమొదటి గిరిజనులు సాగుచేసే సేంద్రీయ కాఫీ బ్రాండ్‌ ఎంతో ప్రాముఖ్యత పొందింది. అరకులోయలోని మరో ఆకర్షణ పద్మాపురం గార్డెన్స్‌ను ఇక్కడకు వచ్చే పర్యాటకులు విరివిగా సందర్శిస్తారు. పద్మాపురం గార్డెన్స్‌లో వేలాడే కాటేజీలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. గార్డెన్‌లో అనేక రకాల అందమైన మొక్కలు, పువ్వులు ఉన్నాయి. తోట చుట్టూ టాయ్ ట్రైన్ రైడ్ పిల్లలలో బాగా ప్రాచుర్యం పొందింది. అరకు సమీపంలో సంగ్దా జలపాతం, డుంబ్రిగూడ జలపాతాలు పర్యాటకులను మైమరపిస్తాయి.

 

తదుపరి వ్యాసం