AP TG Heat Waves: ఏపీ, తెలంగాణలో మళ్లీ ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాల్పులతో జనం విలవిల
31 May 2024, 6:39 IST
- AP TG Heat Waves: ఏపీలో మళ్లీ భానుడి భగభగలతో జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం అల్లూరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
ఏపీ తెలంగాణలలో ఎండలు
AP TG Heat Waves: తెలుగు, రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ ఉగ్రరూపం చూపిస్తున్నాయి. రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈ ఏడాది వేసవి ప్రభావం పెద్దగా లేదని జనం సంతోష పడుతుండగానే మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంది. పగటి ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉంది. ఎండ వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు.
రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతవరణం ఉంటుందని ఐఎండి అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శుక్రవారం అల్లూరి జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు, 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. కూనవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
శుక్రవారం ఏపీలో 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. విజయ నగరం జిల్లాలో 3, పార్వతీపురంమన్యంలో 3, అల్లూరిలో 3, ఏలూరులో 2, కృష్ణా 4, ఎన్టీఆర్ 13, గుంటూరులో 17, బాపట్ల14, పల్నాడు 28, ప్రకాశం 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి2, వైయస్ఆర్ 4, అన్నమయ్య జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8° డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7° డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6°డిగ్రీలు, కృష్ణా జిల్లా కోడూరులో 44.5° డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4°డిగ్రీలు, అల్లూరి జిల్లా కూనవరంలో 44.3° డిగ్రీలు, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1° డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.అల్లూరి జిల్లా నెల్లిపాకలో 46.2డిగ్రీలు, చింతూరులో 45.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కూనవరంలో 46.5డిగ్రీలు, రావికమతంలో 42.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
తెలంగాణలో
తెలంగాణలో గురువారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత, ఎండవేడితో జనం అల్లాడిపోయారు. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బీమారంలో 47.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రంలో 46.8డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 46.7డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 46.6డిగ్రీలు, కాగజ్‌నగర్, ఖమ్మం జిల్లా పమ్మిలో 46.5డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారం, కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారంలో 46.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. గురువారం తెలంగాణ వ్యాప్తంగా వడగాలులతో ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా బంగంపల్లిలో చంద్రయ్య, సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో జనార్థన్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ఎల్లయ్య వడగాల్పులకు మృతి చెందారు.