తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Michaung Cyclone: ఏపీలో లక్షన్నర ఎకరాల్లో వరికి నష్టం, అన్నదాతలు విలవిల

Michaung Cyclone: ఏపీలో లక్షన్నర ఎకరాల్లో వరికి నష్టం, అన్నదాతలు విలవిల

Sarath chandra.B HT Telugu

08 December 2023, 7:01 IST

google News
    • Michaung Cyclone: మిగ్‌జాం తుఫానుతో ఆంధ్రప్రదేశ్‌లో అపార నష్టం వాటిల్లింది. లక్షన్నర ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మరో 32వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయాయి. 
పంట నష్టంపై సమీక్షిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి
పంట నష్టంపై సమీక్షిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి

పంట నష్టంపై సమీక్షిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి

Michaung Cyclone: తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం 1,45,795 హెక్టార్లలో వరి, 31,498 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వరి 92,577 హెక్టార్లలో నీట మునిగి పోయింది. మరో 53,218 హెక్టార్లలో నేలకొరిగిందని అధికారులు అంచనా వేశారు.

ఆర్‌అండ్‌బీకి సంబంధించి 2,816 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. పంచాయతీ రాజ్‌కు సంబంధించి మరో 93.8 కిలోమీటర్ల పొడవున 55 రహదార్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 14 పట్టణాల్లో 56.7 కిలోమీటర్ల మేర రోడ్లు, 2,770 వీధి లైట్లు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు.

9 జిల్లాల్లో 33 కేవీ ఫీడర్లు 210, 11కేవీ ఫీడర్లు 1,581, 33/11కేవీ ఫీడర్లు 353 ప్రభావితమయ్యాయని, 33 కేవీ స్తంభాలు 379, 11కేవీ స్తంభాలు 1,592, ఎల్టీ స్తంభాలు 2,481 దెబ్బతిన్నాయని గుర్తించారు. దీనివల్ల 3,292 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.

ఇప్పటికి 3,111 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామని, మరో 181 గ్రామాల్లో పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. సహాయ పునరావాస కేంద్రాలకు 9,321 కుటుంబాలను చేర్చగా, 1,162 మందికి రూ.2.5కోట్లు సహాయం అందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి సమీక్షలో అధికారులు వెల్లడించారు.

నష్టం అంచనా, బాధితులకు సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సేవల్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పరిశీలనకు కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్రానికి లేఖ పంపుతున్నామని, ఈలోగా సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని నిర్దేశించారు.

విద్యుత్‌ సరఫరా, రోడ్లు, తాగునీటి సౌకర్యాలను పునరుద్ధరించాలని, పంట నష్టం అంచనా వేయాలని, పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్‌ పూర్తి కాగానే పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు నూరుశాతం బీమా వర్తింపజేస్తామన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం సేకరించేలా నిబంధనలు సడలించాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.

పునరావాస కేంద్రాలకు వచ్చిన 9,321 కుటుంబాలకు రూ.2,500, ఒక వ్యక్తికైతే రూ.వెయ్యి చొప్పున 1,162 మందికి మొత్తం రూ.2.50 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఒక లక్షా వెయ్యి కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేశామని, మిగిలిన కుటుంబాలకూ త్వరలో అందిస్తామని చెప్పారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ పశువులు, మత్స్యకారుల బోట్లు, వలల నష్టాన్ని శుక్రవారం లోగా గుర్తించి పరిహారం అందిస్తామన్నారు. 11 నుంచి పంట నష్టం ఎన్యూమరేషన్‌ ప్రారంభిస్తామన్నారు.

తుఫానుకు ప్రభావితమైన లక్షా 1 వేయి కుటుంబాలకు గాను ఇప్పటికే 65వేల 256 కుటుంబాలకు 25 కిలోలో బియ్యం,కిలో కందిపప్పు,కిలో పామాయిల్,కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళా దుంపలు వంటి నిత్యావసర సరకులను పంపిణీ చేయగా మిగతా కుటుంబాలకు కూడా త్వరగా అందిస్తామని వివరించారు.

కల్లాలపై ఉన్న ధాన్యాన్ని సమీప మార్కెట్ యార్డులు,గోదాములకు తరలించి కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని పౌరసరఫరా శాఖ కమిషనర్‌ వివరించారు. ఆఫ్‌ లైన్ విధానంలో కూడా రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

తదుపరి వ్యాసం