IDBI PGDBF: గ్యారంటీ జాబ్‌తో ఐడిబిఐ పిజిడిబిఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది…
12 February 2024, 6:48 IST
- IDBI PGDBF: బ్యాంకింగ్ రంగ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులును తీర్చిదిద్దడానికి బ్యాంకింగ్ ఫైనాన్స్‌లో పిజి డిప్లొమా కోర్సుతో పాటు ఉద్యోగాన్ని కల్పించే పిజిడిబిఎఫ్ నోటిఫికేషన్ వెలువడింది. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ సంస్థలు ఐబిపిఎస్‌కే పరిమితం అయ్యాయి.
IDBI PGDBF Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకులో 500 పోస్టులు
IDBI PGDBF: బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ నిపుణుల నియామకం కోసం కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు నిర్వహిస్తోన్న పిజిడిబిఎఫ్ కోర్సుకు నోటిఫికేషన్ వెలువడింది. పుష్కర కాలం క్రితం తొలిసారి సిండికేట్ బ్యాంకులో ఈ తరహా కోర్సులతో కూడిన ఉద్యోగాలను ప్రకటించాయి.
అప్పటి నుంచిఈ కోర్సులకు క్రేజ్ ఏర్పడింది. మొదట్లో విద్యార్ధులకు అవగాహన లేక ఈ కోర్సులకు పెద్దగా కాంపిటిషన్ ఉండేది కాదు. కోర్సు వ్యయం భరించాల్సి ఉంటుందనే అపోహతో ఉద్యోగాలను దూరం చేసుకునే వారు. ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ మాదిరే పిజిడిబిఎఫ్ కోర్సు కూడా ఉంటుంది. ఐబిపిఎస్‌లో నేరుగా ఉద్యోగంలో చేరితే ఇందులో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏడాది వ్యవధి ఉండే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిప్లొమా కోర్సుతో పాటు ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా ఇందులో అందిస్తారు. కోర్సు ఫీజును నిర్ణీత వ్యవధిలో జీతం నుంచి మినహాయించుకోవడమే ఈ కోర్సుల్లో ఉండే వెసులుబాటు. ఎంపికైన విద్యార్ధులకు ఎలాంటి అదనపు భారం ఉండదు. కోర్సు పూర్తయ్యాక జీతం నుంచి చెల్లించే వీలు కల్పిస్తారు.
చదవుకుంటూనే ఉద్యోగం పొందడానికి సులువైన మార్గంగా పిజిడిబిఎఫ్ కోర్సులు గుర్తింపు పొందాయి. బ్యాంకింగ్ రంగంలో పిఓ ఉద్యోగాల భర్తీకి ఐబిపిఎస్ రిక్రూట్‌మెంట్లను నిర్వహిస్తున్నా కొన్ని బ్యాంకులు మాత్రం ప్రత్యేకంగా బ్యాంకింగ్ కోర్సుల ద్వారా కూడా నియామకాలు చేపడుతున్నాయి.
డిగ్రీ విద్యార్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 500ఖాళీలను భర్తీ చేయనున్నారు. కోర్సును పూర్తి చేసిన వారు అసిస్టెంట్ మేనేజర్ హోదా ఉద్యోగంలో చేరొచ్చు.ప్రారంభంలో వార్షిక వేతనం రూ.6.5లక్షల వరకు చెల్లిస్తారు. దేశంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
మొత్తం ఖాళీలు...
500ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపికైన వారికి ఏడాది వ్యవధి ఉన్న కోర్సును నిర్వహిస్తారు. వీటిలో అన్ రిజర్వ్‌డ్ 203, ఈబీసీ 135, ఎస్సీ 75, ఎస్టీ 37, ఈడబ్ల్యుఎస్ ఉద్యోగాలు 50 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2024 జనవరి 31 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు 2024 జనవరి 31 నాటికి 20-25ఏళ్ళలోపు ఉండాలి. 1999 జనవరి 31 నుంచి 2004 జనవరి 31లోపు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇస్తారు.
మార్చి 17వ తేదీన ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఏపీలో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
దరఖాస్తు ఫీజు...
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.200, మిగిలిన అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీలోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షకు కేవలం 35రోజుల వ్యవధి మాత్రమే ఉంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిలో షార్ట్ లిస్ట్ అయిన వారికి కోర్సును అందిస్తారు. పూర్తి వివరాలు ఐడిబిఐ బ్యాంక్ వెబ్‌సైట్ www.idbibank.in సైట్‌లో లభిస్తాయి.
పరీక్ష నిర్వహణ ఇలా....
ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షలో 200ప్రశ్నలకు 120నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి అనువుగా ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి 36సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. మాక్ టెస్టులు హాజరుకావాల్సి ఉంటుంది.
తక్కువ సమయం ఉన్నందున సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లాజికల్ రీజనింగ్ డేటా, అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్ వంటి సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.