TTD New EO : ధర్మారెడ్డి ఔట్..! టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు, ఉత్తర్వులు జారీ
14 June 2024, 22:36 IST
- TTD New EO Syamala Rao: ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు సర్కార్… ప్రక్షాళన షురూ చేసింది. టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమించింది.
తిరుమల కొత్త ఈవో
TTD New EO Syamala Rao: ఏపీలోని చంద్రబాబు సర్కార్… తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈవోని నియమించింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని బదిలీ చేస్తూ…. ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
జే శ్యామల రావు 1997కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. దేవాదాయ శాఖలోని రెవెన్యూ విభాగానికి బదిలీ చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం తిరుమలతో పాటు విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం తిరుమలలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. ఏపీలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని చెప్పారు. తిరుమలను ఐదేళ్లలో అపవిత్రం చేశారని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్పవేరే నినాదం ఉండకూడదన్నారు.
గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని, బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నారని, తిరుమల కొండపైకి గంజాయి. నాన్‌వెజ్, మద్యంతో పాటు అన్యమత ప్రచారాలను కూడా అనుమతించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామిని ఊరూరా తిప్పారని, పెళ్లిళ్లు పేరంటానికి కూడా శ్రీవారిని తీసుకెళ్లారని, వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈజన్మలోనే శిక్ష తప్పదని నిరూపితమైందన్నారు.
వెంకటేశ్వర స్వామి కులదైవమని, 2003లో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినపుడు క్లెమోర్ మైన్స్ పేలాయని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తాను చనిపోతే ఆయనకు అపవాదు వచ్చేది. నా వల్ల రాష్ట్రానికి అవసరం ఉందని గుర్తించి స్వామివారు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇకపై ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతి అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటానని… టీటీడీతోనే రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు…మరునాడు అంటే శుక్రవారమే ఈవో ధర్మారెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో శ్యామలరావును నియమించింది. శాఖలవారీగా ప్రక్షాళన చేసే దిశగా… చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.