AP IAS Transfers : ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు
18 August 2024, 8:41 IST
- IAS Transfers in AP: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం ఎనిమిది మందికి స్థానచలనం కల్పించింది.
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు
ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీలు అయ్యారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎన్. తేజ్భరత్, పాడేర్ సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ నియమితులయ్యారు. పాడేరు ఐటీడీఏ పీవోగా కూడా ప్రఖర్ జైన్కే అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ మీనా, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా శివనారయణ శర్మ నియమితులయ్యారు. పార్వతీపురం సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాస్తవకు అవకాశం ఇవ్వగా… పార్వతీపురం ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు కూడా చూడనున్నారు. ఏటీపాక సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్ ను నియమించారు. చిత్తూరు ఐటీడీఏ పీవోగా అపూర్వ భరత్ కే అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఏపీలో రెండు రోజుల కిందట పది మంది ఐపీఎస్‌లు కూడా బదిలీ అయ్యారు. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ కాగా…. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సుమిత్ సునీల్ నియమితులయ్యారు. అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ వ్యవహరించనున్నారు. విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా నియమితులయ్యారు. ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్సీగా పంకజ్‌కుమార్ మీనా, పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురాన్ అంకిత్ బదిలీ అయ్యారు.
ఉద్యోగుల బదిలీలు
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 15 శాఖల్లో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
పురపాలక, గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య పన్నులు, విద్యుత్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. 15 శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ నెలాఖరు లోగా ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.