తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Pawan Meet : పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు, సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ

Chandrababu Pawan Meet : పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు, సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ

17 December 2023, 22:11 IST

google News
    • Chandrababu Pawan Meet : టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్
చంద్రబాబు, పవన్ కల్యాణ్

చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu Pawan Meet : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ, జనసేన పొత్తులపై చంద్రబాబు, పవన్ ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చించినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు పవన్‌ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. మళ్లీ దాదాపుగా పదేళ్ల తర్వాత మరోసారి చంద్రబాబు పవన్ నివాసానికి వెళ్లారు.

సీట్ల సర్దుబాటుపై చర్చలు

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. టీడీపీ ప్రకటించిన సూపర్‌సిక్స్‌ మినీ మేనిఫెస్టోకి జనసేన పార్టీ కొన్ని హామీలను జోడించాలని సూచించింది. మొత్తం 10 అంశాలతో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను జనసేన సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమం పేరులోనూ మార్పులు చేయనున్నట్టు సమాచారం. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు ఉన్న ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఇరు పార్టీల సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

వైసీపీ మైండ్ గేమ్ లో పడొద్దు-జనసేన

గత వారం రోజులుగా టీవీ ఛానెళ్లు, వివిధ సమావేశాల్లో జనసేన నాయకుల ప్రసంగాలు, సోషల్ మీడియాలో జన సైనికులు, వీర మహిళలు స్పందిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిశితంగా విశ్లేషణ చేశారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ లోకి జనసేన నేతలు తెలియకుండానే పడుతున్నారని, ఆ చట్రంలోనే మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని, నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు కొన్ని సూచనలు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేసి, రాష్ట్రంలో ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు తరచూ ఇలాంటి ఎత్తుగడాలకు పాల్పడుతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మిగ్ జామ్ తుపాను నష్టాలు, 30 వేల మంది ఆడ బిడ్డలు, మహిళల అదృశ్యం, నరక కూపాలుగా మారిన రోడ్లు, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి తరలిపోవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై జరుగుతున్న అకృత్యాలు, ఎమ్మెల్సీ అనందబాబు ఎస్సీ డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేయడం, శాంతిభద్రతల వైఫల్యం, మహిళలపై అత్యాచారాలు, ఇసుక దోపిడీ, పశువుల కొనుగోలు కుంభకోణం, విద్యా, పరిశ్రమల శాఖల్లో అవినీతి లాంటి విషయాలపై ప్రజల దృష్టి మరల్చడానికే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నేతలు, కార్యకర్తలు గ్రహించాలన్నారు.

పొత్తు భగ్నం చేసేందుకు వైసీపీ కుట్రలు

"పవన్ కల్యాణ్, జనసేన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు వాటిని ప్రజల విజ్ఞతకే వదిలేయాలని పవన్ కోరారు. 'ఇటువంటి వాటిపై మేం స్పందించం. మా నాయకుడు మాకు ఇదే చెప్పారు. పబ్లిక్ పాలసీ, ప్రజా సంబంధిత అంశాలపై చర్చిస్తాం' అని చెప్పండి. రాష్ట్రంలో ఎటువంటి అవాంచనీయ ఘటన చోటుచేసుకున్నా, ప్రభుత్వం వైఫల్యం చెందినా ఆ విషయాల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. తుపాను మూలంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిని రైతులు కన్నీరుమున్నీరు అవుతుంటే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ అధినేత వేదికలెక్కి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడమే తాజా ఉదాహరణ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన దృష్టి మరల్చడానికి, తెలుగుదేశంతో పొత్తు భగ్నం చేసే విధంగా ప్రత్యర్థులు అవాస్తవాలను, గోబెల్స్ ప్రచారాలు చేస్తారు. ఇందుకోసం సోషల్ మీడియాను వాడతారు. ఇలాంటి విషయాలపై పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ పవన్ కల్యాణ్ సూచించారు. చాలా సందర్భాల్లో వైసీపీ మైండ్ గేమ్ ఎత్తుగడపై పవన్ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు."- జనసేన

తదుపరి వ్యాసం