APSRTC Discount: హైదరాబాద్, బెంగుళూరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి భారీ డిస్కౌంట్, తగ్గిన ఓఆర్ ఎఫెక్ట్…
28 November 2024, 7:00 IST
- APSRTC Discount: హైదరాబాద్, బెంగుళూరు బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గడంతో హైదరాబాద్, బెంగుళూరు బస్సుల్లో ప్రయాణానికి భారీ డిస్కౌంట్ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 10 నుంచి 20శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్, బెంగుళూరు ప్రయాణాలకు డిస్కౌంట్
APSRTC Discount: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆక్యుపెన్సీ రేట్ పెంచుకోడానికి ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. విజయవాడ నుంచి ప్రధానంగా హైదరాబాద్, బెంగుళూరు మార్గాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పోటీతో పాటు ఇతర కారణాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సగానికి సగం ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో దానిని పెంచుకోడానికి డిస్కౌంట్లను ప్రకటించారు.
ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రయాణాలకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. ఏసీ సర్వీసులకు శీతాకాలంలో ఆదరణ తగ్గడంతో ప్రయాణికుల సంఖ్యను పెంచుకోడానికి ఏపీఎస్ ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. విజయవాడ నుంచి హైద రాబాద్ మార్గంలో ప్రయాణాలకు అక్టోబర్ నెలలో 53 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. బెంగ ళూరుతో పాటు ఇతర రూట్లలో ఓ ఆర్ రేటు 57 శాతం ఉంది. ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోడానికి అధికారులు ప్రత్యామ్నయాలు అన్వేషిస్తున్నారు.
ఓఆర్‌ను పెంచుకునే క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో వచ్చే నెల 1 నుంచి 10, 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా అధికారులు ప్రకటించారు. హైదరాబాద్, బెంగుళూరు సహా ఇతర మార్గాల్లో రాను, పోను టిక్కెట్లు ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే అన్ని బస్సుల్లో చార్జీల్లో 10 శాతం రాయితీ సౌకర్యం ఇస్తున్నా మని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం విజయవాడ నుంచి ప్రయాణించే ఏసీ బస్సులు 75, వెన్నెల బస్సులు 17, డాల్ఫిన్ క్రూయిజ్–8, అమరావతి బస్సులు 20, ఇంద్ర బస్సులు 23, మెట్రో లగ్జరీ బస్సులు 7 ఉన్నాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ మధ్య 10 శాతం రాయితీతో ఛార్జీ రూ. 700 వసూలు చేస్తారు. ఈ రూట్‌లో సాధారణ ఛార్జీ రూ.770, కూకట్‌పల్లి, ఇతర ప్రాంతాలకు 10 శాతం రాయితీతో రూ. 750 వసూలు చేస్తారు. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీ రూ. 830 ఉంది.
విజయవాడ-బెంగళూరు మధ్య నడిచే వెన్నెల స్లీపర్, అమరావతి బస్సుల్లో ఆది వారం విజయవాడ నుంచి వెళ్లే సర్వీసు, శుక్రవారం బెంగుళూరు నుంచి వచ్చే సర్వీసు మినహా మిగిలిన రోజుల్లో బెంగుళూరు మాజిస్టిక్ బస్టేషన్ వరకు వెన్నెల స్లీపర్ బస్సులో 20 శాతం రాయితీతో రూ.1770గా నిర్ణయించారు. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీ రూ. 2170 ఉంటుంది. అమరావతి మల్టీయాక్సిల్ ఛార్జీ రూ. 1530కు తగ్గించారు. ఇందులో సాధారణ ఛార్జీ రూ.1870గా ఉంది.
విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నడిచే బస్సుల్లో అన్నిరకాల డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఆదివారం హైదరాబాద్ వైపు, శుక్ర వారం విజయవాడ వైపు ప్రయాణించే బస్సులు మినహా మిగిలిన రోజుల్లో డిస్కౌంట్ ప్రకటించారు.
విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీతో ఛార్జీ రూ.970 వసూలు చేస్తారు. ఈ బస్సులో సాధారణ ఛార్జీ రూ.1070గా ఉంటే రూ.100 రాయితీగా నిర్ణయించారు.