వైఎస్సార్ కాపు నేస్తం సాయం ఎవరికి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
24 January 2022, 20:24 IST
- నవరత్నాలు సంక్షేమ పథకంలో భాగంగా వైఎస్సార్ కాపు నేస్తం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం అమలుచేస్తోంది.
- కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదికి రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో రూ. 75,000 మేర ఆర్థిక సాయం అందిస్తుంది.
వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి (ఫైల్ ఫొటో)
నవరత్నాల సంక్షేమ పథకంలో భాగంగా వైఎస్సార్ కాపు నేస్తం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకానికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి తదితర కులాల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏడాదికి రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో రూ. 75,000 మేర ఆర్థిక సాయం అందించే ఈ వైఎస్సార్ కాపు నేస్తం పథకం లబ్ధిదారుల వయస్సు 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రామీణులైతే వార్షికాదాయం రూ. 1,20,000లకు మించరాదు. పట్టణవాసులైైతే రూ. 1,44,000 లకు మించరాదు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు బీపీఎల్ కార్డు ఉన్నా సరిపోతుంది.
కుటుంబం మొత్తానికి మూడెకరాల మాగాణి లేదా పదెకరాల మెట్ట భూమికి మించి ఉండరాదు. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయి గానీ, పెన్షనర్ అయి గానీ ఉండరాదు. కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. అయితే ట్యాక్సీ, ట్రాక్టర్‌కు మినహాయింపు ఉంది.
కుటుంబంలో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. దరఖాస్తుదారుడికి పట్టణ ప్రాంతంలో 750 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు మించి నిర్మాణం ఉండరాదు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణపత్రం, కులధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టుగా కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కాపు నేస్తం లబ్ధి కోసం గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వాలంటీర్ ఫీల్డ్ లెవల్ వెరిఫికేషన్ పత్రంలో లబ్ధిదారు వివరాలన్నీ నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన తరువాత దాని పురోగతిని తెలుసుకునేందుకు గ్రామ సచివాలయంలో సంప్రదించవచ్చు.