AP EAP CET 2024: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ రాజీనామా,ఈఏపీ సెట్ ఫలితాలు, కౌన్సిలింగ్‌పై మరింత సందిగ్ధత
06 June 2024, 7:24 IST
- AP EAP CET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ నిర్వహణపై మరింత సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించడంతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈఏపీ సెట్ ఫలితాల విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది
ఏపీ ఈఏపీ సెట్ 2024 ఫలితాల విడుదలపై కొనసాగుతున్న సందిగ్థత
AP EAP CET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్ 2024 ఫలితాల విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. పొరుగున ఉన్న తెలంగాణలో ఫలితాలు విడుదలై కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఏపీలో డీమ్డ్ యూనివర్శిటీలు ఇప్పటికే ప్రవేశాలను ప్రారంభించాయి. అడ్మిషన్లు కూడా చాలా వరకు ముగింపు దశకు వచ్చేశాయి.
ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలవడంతో ఛైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు. ఈఏపీసెట్ ఫలితాలను ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు విడుదల చేయకుండా తాత్సరం చేసిన ఛైర్మన్ చివరకు ఇంటి ముఖం పట్టారు. దీంతో విద్యార్ధులు ఈఏపీసెట్ ఫలితాల కోసం ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు పొరుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ మొదలైపోవడం, డీమ్డ్ యూనివర్శిటీలు, స్టేట్ ప్రైవేట్ యూనివర్శిటీల్లో ప్రవేశాలు ప్రారంభం కావడంతో తమ పరిస్థితి ఏమిటని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహించారు. మే 16 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ పద్ధతిలో ఈఏపీసెట్ నిర్వహించారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను పరీక్షలు ముగిసి రెండు వారాలు దాటుతున్నా విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 3లక్షల మంది ఎంసెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామాను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు పంపారు.
రాజీనామాకు ముందే ఉన్నత విద్యా మండలిలో కీలక దస్త్రాలను హేమచంద్రారెడ్డి ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు బదిలీలు, విధుల నుంచి రిలీవ్ చేసే విషయాల్లో అప్రమత్తంగా వ్యవహారించాలని జిఏడి స్పష్టం చేయడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు రాజీనామాలను అమోదించలేమని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టం చేయడంతో ఛైర్మన్ సెలవుపై వెళ్లారు.
ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు సూచనతో హేమచంద్రా రెడ్డి మెడికల్ లీవ్‌పై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జి భాద్యతల్ని వైస్ చైర్మన్ రామమోహన్ రావుకు అప్పగిం చారు. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేయడంలో లో కావాలనే తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలో ఈఏపీ సెట్ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తైంది. విద్యార్ధుల నుంచి ఫలితాల విడుదలపై డిమాండ్ పెరుగుతున్నా ఉన్నత విద్యామండలి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఫలితాల విడుదలపై కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు స్పష్టత రాకపోవచ్చని అనధికారిక సమాచారం. చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తే తప్ప దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోలేకపోవచ్చని చెబుతున్నారు.
49 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ….
రాష్ట్ర వ్యాప్తంగా 49 రీజనల్ సెంటర్స్ లో ఈఏపీ సెట్ కోసం 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,640 మంది ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,104, బాలికలు 1,81,536 మంది ఉన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుండి నిర్వహించాల్సిన ఎంట్రన్స్ పరీక్షలు ఈ నెల 16 నుండి 23 వరకు నిర్వహించారు. ఉదయం 9- 12, మధ్యాహ్నం 2.30 - 5.30 వరకు రెండు సెషన్స్ లో పరీక్షల నిర్వహించారు.
బైపీసీ విద్యార్థులకు ఈ నెల 16,17 తేదీల్లో 4 సెషన్స్ లో, ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుండి 23 వరకు 9 సెషన్స్ లో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించారు. గతేడాది మధ్యాహ్నం సెషన్ 3 నుండి 6 గంటల వరకు ఉండేదని ఈ ఏడాది అరగంట ముందుగా అనగా మధ్యాహ్నం 2.30 గంటల నుండి నిర్వహించారు.