AP HighCourt on JNTU: జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌పై హైకోర్టు ఆగ్రహం...సీఐడీ విచారణకు ఆదేశం
24 July 2024, 10:00 IST
- AP HighCourt on JNTU: 48 కాలేజీలకు అటానమస్ హోదా ఇచ్చిన జేఎన్‌టీయూ కాకినాడ రిజిస్ట్రార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది.
జేఎన్‌టియూ కాకినాడ రిజిస్టార్‌పై హైకోర్టు ఆగ్రహం
AP HighCourt on JNTU: కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) పరిధిలో అర్హత లేని 48 కాలేజీలకు ఆటానమస్ (స్వయంప్రతిపత్తి ) హోదా కల్పించారనే ఆరోపణలపై జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ అనుసరించిన తీరును హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
వర్శిటీ రిజిస్టార్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేయాలని, సీఐడీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు అందుకుని తన తరపున న్యాయవాదిని నియమించుకోవడం, లేకపోతే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడంపై రిజిస్ట్రార్‌పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (2023-24) నిబంధన 7.39ని పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ 48 కాలేజీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ)లు ఇచ్చారని పేర్కొంటూ మేరీ ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీకే రావు, జోసెఫ్ శ్రీహర్ష హైకోర్టును ఆశ్రయించారు.
48 కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా స్వయంప్రతిపత్తి హోదా దక్కించుకున్నాయని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), లేకపోతే సీఐడీతో విచారణకు ఆదేశించాలని వారు హైకోర్టును కోరారు.
ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు జులై 1న కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌తో సహా పలువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును వాయిదా వేసింది. తిరిగి కేసును జులై 23 (మంగళవారం) విచారణకు వచ్చింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం ముందు, పిటిషనర్ తరపు న్యాయవాది జులై 3న జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు అందజేశామని, దానికి సంబంధించిన రుజువులను కోర్టుకు సమర్పించామని కోరినట్లు తెలిపారు.
నోటీసులు అందుకున్నా రిజిస్ట్రార్ తరపున న్యాయవాది కానీ, రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా కూడా హాజరుకాలేదు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతివాది తరపున ఎటువంటి స్పందన రాకపోవడంతో రిట్ పిటిషన్‌లో చేసిన వాదనలను అంగీకరిస్తున్నట్లు భావిస్తూ పిటిషన్‌ను అనుమతించాలని నిర్ణయించారు.
జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌పై పిటిషన్‌లో కోరినట్లుగా కేసు నమోదు చేయాలని, చట్టానికి అనుగుణంగా చార్జిషీట్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించారు. కేసు నమోదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను ఈనెల 26 (శుక్రవారం)న తమకు అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఉత్తర్వులు ఇచ్చారు.
కాకినాడ జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎల్.సుమలత బాధ్యతలు స్వీకరించినప్పుడు యూనివర్శిటీ గెస్ట్ హౌస్ వివాదం చెలరేగింది. ఆమె జేఎన్‌టీయూ కాకినాడలో యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, వాల్యుయేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు.
2021 ఆగస్టులో ఆమె నియామకం అయ్యారు. అప్పటికే రిజిస్ట్రార్‌గా ఉన్న ఆర్. శ్రీనివాసరావు మరణంతో ఖాళీగా ఏర్పడిన ఆ స్థానంలో ప్రొఫెసర్ సుమలతను జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్ రామలింగరాజు నియమించారు.
అప్పుడు యూనివర్శిటీలోని గెస్ట్‌హౌస్‌ను ఒక ప్రొఫెసర్ కుటుంబానికి చెందిన నూతన దంపతులకు కేటాయించడంపై తీవ్ర దుమారం రేగింది. గెస్ట్‌హౌస్ ఎపిసోడ్ కారణంగానే రిజిస్ట్రార్‌గా ఆమె నియామకం జరిగిందని అప్పట్లో చర్చ జరిగింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)