Tirumala Heli Ride: తిరుమలలో పర్యాటకులకు అందుబాటులోకి హెలికాఫ్టర్ జాయ్‌రైడ్
12 June 2023, 9:27 IST
- Tirumala Heli Ride: తిరుమలలో పర్యాటకులకు హెలికాఫ్టర్ రైడ్ అందుబాటులోకి రానుంది. తిరుమల స్వామి వారిని దర్శించడానికి వచ్చే భక్తులతో పాటు సాధారణ పర్యాటకులకు జాయ్‌రైడ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
త్వరలో తిరుమలలో హెలికాఫ్టర్ సేవలు ప్రారంభం (ఫైల్)
Tirumala Heli Ride:తిరుమలలో హెలికాఫ్టర్ టూరిజం ప్రారంభం కానుంది. తిరుమల గిరుల అందాలను తిలకించేందుకు హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతిలో త్వరలో హెలికాఫ్టర్ టూరిజం సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల కొండల అందాలను గగనతలం నుంచి వీక్షేందుకు వీలుగా హెలిటూరిజం ప్రారంభిస్తున్నారు.
తిరుపతి పరిసర ప్రాంతాల్లో హెలికాఫ్టర్ సేవల్ని ప్రారంభించడానికి ఏరోడాన్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు ట్రయల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హెలిటూరిజం కోసం టిక్కెట్ల విక్రయాలను కూడా ప్రారంభించారు. హెలికాఫ్టర్ నుంచి తిరుపతి, పరిసర ప్రాంతాల అందాలను వీక్షించవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు రూ.6వేలు చెల్లించాల్సి ఉంటుంది. జాయ్ రైడ్‌ను 8నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆరు సీట్ల హెలికాఫ్టర్ వినియోగిస్తారు.
ఈ హెలికాఫ్టర్‌లో పైలట్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. కో పైలట్ ఉంటే నలుగురిని ఎక్కిస్తారు. తిరుపతి నుంచి చంద్రగిరి కోట వరకు తీసుకు వెళ్లి, తిరిగి వెనక్కి తీసుకువస్తారు. గంటకు ఆరు ట్రిప్పులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి వాసులకు కూడా ఈ రైడ్ అందుబాటులో ఉండనుంది. తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తుంటారు. తిరుమల వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏరోడాన్ సంస్థ హెలికాఫ్టర్ రైడ్ ఏర్పాటు చేసింది.