Kolusu Prthasaradhi: వేధించి వెళ్లగొడితే ఏకంగా మంత్రి అయ్యారు.. సారధి పాలిట అదృష్టంగా మారిన జగన్ నిర్ణయం
01 July 2024, 13:25 IST
- Kolusu Prthasaradhi: అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిపై ఆ పార్టీ వేధింపులకు పాల్పడింది. చివరకు పోటీ చేయడానికి టిక్కెట్ కూడా తేల్చేసింది. పార్టీ మారడంతో ఆయన అదృష్టం కూడా మారిపోయింది.
ఏపీలో సారథి పాలిట వరంగా మారిన జగన్ నిర్ణయం
Kolusu Prthasaradhi: అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అవమానాలు తప్పలేదు. ఐదేళ్లలో ఒకటి రెండు సార్లు తప్ప కనీసం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినా, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. చివరకు అవమానకర పరిస్థితుల్లో పార్టీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచి ఏకంగా మంత్రి కూడా అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన పార్థసారథి 2014లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్నా వైసీపీలో సారథికి అవమానాలు తప్పలేదు. 2014లో ఓటమి తర్వాత ఏపీ రాజధాని విజయవాడలో ఏర్పాటయ్యాక సుదీర్ఘ కాలం పార్టీ కార్యకలాపాలు సారథికి సంబంధించిన స్థలంలోనే సాగింది. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న విశాలమైన స్థలంలో పార్థసారథికి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఆ స్థలాన్ని గతంలో వైఎస్ కుటుంబం నుంచి సారథి తండ్రి కేపీ రెడ్డయ్య యాదవ్ కొనుగోలు చేశారనే ప్రచారం కూడా ఉంది.
విజయవాడ స్వరాజ్య మైదాన్ ఎదురుగా ఉన్నా దాదాపు రెండున్నర ఎకరాలకు పైబడిన స్థలం కోట్లాది రుపాయల ఖరీదు చేస్తుంది. ఈ స్థలం వ్యవహారంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పార్థసారధికి మధ్య దూరం పెరిగినట్టు సన్నిహితులు చెబుతారు. 2014లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలను ఏపీలో విజయవాడ కేంద్రంగా నడిపించాలని భావించినపుడు సారథి తన సొంత స్థలంలో తాత్కలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించారు. 2019 ఎన్నికలకు ముందే దానిని తాడేపల్లికి తరలించారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని సారథి భావించారు. ఆయనతో పాటు మంత్రులుగా పనిచేసిన బొత్స, పెద్దిరెడ్డి వంటి వారికి అవకాశం దక్కినా సారథికి మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు. మంత్రి వర్గ విస్తరణ సమయంలో సారథికి ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినా దానిని నిలబెట్టుకోలేదు.
ఆ తర్వాత అనూహ్యంగా సారథికి తాడేపల్లిలో ఎంట్రీ కూడా నిలిచిపోయింది. దీనికి విజయవాడ ఎంజి రోడ్డులో ఉన్న స్థలమే కారణమని సన్నిహితులు చెబుతున్నారు. విజయవాడ స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరినా సారథి సుముఖత చూపకపోవడంతో ఆయన్ని కలిసేందుకు కూడా అనుమతించ లేదని తెలుస్తోంది. అదే సమయంలో జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణలో ఆక్రమాలకు పాల్పడ్డారని విస్తృత ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలకు స్థల సేకరణలో భారీగా అక్రమాలు జరిగినా, సారథికి వ్యతిరేకంగా మాత్రమే ప్రచారం జరిగింది.
కోట్లాది రుపాయల విలువైన భూమిని దక్కించుకోడానికి తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరిగింది. చివరకు ఎన్నికలకు ముందే పెనమలూరు టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చేయడంతో సారథి తన దారి తాను చూసుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచారు. అనూహ్యంగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. వైసీపీ మరోసారి టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు ఉండేవి కాదు. జగన్ చేసిన ఉపకారంతో టీడీపీ నుంచి గెలిచి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారని సారథి వర్గం చెబుతోంది.