తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambati Rayudu : రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం, వైసీపీకి రాజీనామాపై అంబటి రాయుడు వివరణ

Ambati Rayudu : రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం, వైసీపీకి రాజీనామాపై అంబటి రాయుడు వివరణ

07 January 2024, 18:04 IST

google News
    • Ambati Rayudu : వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై రాయుడు స్పందించారు.
అంబటి రాయుడు
అంబటి రాయుడు

అంబటి రాయుడు

Ambati Rayudu : మాజీ క్రికెట్ అంబటి రాయుడు ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరారు. చేరిన పదిరోజుల్లోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అంబటి రాయుడు రాజీనామా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రతిపక్షాలకు అధికార వైసీపీ ఎటాక్ కు మరో ఆయుధం దొరికినట్లైంది. పది రోజుల్లోనే వైసీపీ అంటే ఏంటో రాయుడికి అర్థమైందని ప్రతిపక్ష నేతలు కామెంట్లు చేశారు. అయితే అంబటి రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ హామీతో వైసీపీలో చేరారని, కానీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని గుంటూరుకు మార్చారని సీఎం జగన్ భావించారు. నరసరావుపేట స్థానాన్ని బీసీ అభ్యర్థి కేటాయించాలని వైసీపీ భావిస్తోంది. అయితే ఇందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సుముఖంగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాయుడు సడెన్ గా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో అసలు ఆడకుండానే రాయుడు అవుటయ్యారంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.

రాజీనామాపై రాయుడు వివరణ

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు తన రాజీనామాపై స్పందించారు. జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ముంబయి ఇండియన్స్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముందని వివరణ ఇచ్చారు.

రాజకీయాల్నుంచి రిటైర్డ్ హర్ట్

గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన అంబటి రాయుడు...సీజన్ ముగియగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఏపీ రాజకీయాల్లో కొన్నాళ్ల పాటు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. వైసీపీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే అంబటి రాయుడు... ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడు మద్దతుగా వ్యవహరించారు. ఆడుదాం ఆంధ్ర క్రికెట్ మ్యాచుల్లో క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడంపై అంబటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. క్రీడాకారులు బలంగా కొట్టడంతో బ్యాట్లు విరిగిపోయాయన్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ తప్పనిసరి అని భావించిన రాయుడు... పది రోజుల క్రితం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే రాజీనామా అంటూ బాంబ్ పేల్చారు. అయితే రాయుడు ఆశించిన సీటు దక్కదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు ఏమన్నారంటే?

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇవాళ తిరువూరు సభలో మాట్లాడుతూ... గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు రాజకీయాల్లో రాణించాలని ఆశపడడంలో తప్పులేదన్నారు. కానీ సీఎం జగన్ రాయుడ్ని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. రాయుడికి గుంటూరు ఎంపీ స్థానం కేటాయిస్తామని నమ్మించారని, ఇంతలో ఇంకొకరికి సీటు ఇస్తామన్నారన్నారు. దీంతో రాయుడికి అసలు విషయం అర్థమైపోయిందన్నారు.

తదుపరి వ్యాసం