CPI Narayana : ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు, కేసులకు భయపడి బీజేపీకి దాసోహం- సీపీఐ నారాయణ
27 August 2023, 15:40 IST
- CPI Narayana : స్వాతంత్ర్యం వచ్చాక ఏ నిందితుడూ ఇన్నాళ్లు బెయిల్ పై బయట ఉండలేదని సీఎం జగన్ నుద్దేశించి సీపీఐ నారాయణ విమర్శించారు.
సీపీఐ నారాయణ
CPI Narayana : సీఎం జగన్ కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు చేరుకుంది. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సభలో సీపీఐ నారాయణ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ పాలనే సాగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్ కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని నారాయణ విమర్శించారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ చాలా ఏళ్లుగా బెయిల్‌పై బయట ఉన్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నాళ్లు బెయిల్‌పై బయట ఉండలేదన్నారు. గుంటూరులో సీపీఐ నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్ ఘటనలకు బీజేపీ కారణం
దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని జగన్ నుంచి కాపాడాలని సీపీఐ ప్రయత్నం చేస్తుందని నారాయణ అన్నారు. మణిపూర్ అల్లర్లలను అడ్డుపెట్టుకుని మతం ముసుగులో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. క్రిమినల్ ఆలోచనలు ఉన్న అమిత్ షా వల్లే మణిపూర్ లాంటి అల్లర్లు జరుగుతున్నాయన్నారు. దేశంలో అల్లర్లకు మతతత్వ ఆందోళనలకు బీజేపీ ఆద్యం పోసిందని సీపీఐ నారాయణ ఆరోపించారు. నిన్నటి వరకూ మోదీని విమర్శించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీ అనుకూలంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు సీఎం జగన్ కేంద్రానికి లొంగిపోయారన్నారు. కూతుర్ని దిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు కేసీఆర్ బీజేపీ తొత్తుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీకి జగన్ దత్తపుత్రుడు
ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడుగా కొనసాగుతున్నారని నారాయణ అన్నారు. జగన్ పైకి వైసీపీ ముద్ర, లోపల బీజేపీ ముద్రతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ దేశంలో బీజేపీ పాలన పోవాలని సీపీఐ పోరాడుతోందని నారాయణ అన్నారు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి ఉన్నారని, ఎన్నికల సమయానికి పవన్ బీజేపీతో ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్థకమే అని నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు అవుతున్నా... నేటికీ నిందితులను పట్టుకోలేదని ఆరోపించారు. పులివెందులలో చిన్న పిల్లాలడిన అడిగినా వివేకా హత్య చేసిందెవరో చెబుతారన్నారు. సీబీఐ మాత్రం ఇంకా విచారణ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.