Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరం, బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నం- సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన బాలిక
20 November 2024, 12:58 IST
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. అయితే ఈ బాలిక తెలివిగా వీడియో రికార్డు చేసింది. ఆ వీడియోను తల్లిదండ్రులకు చూపించింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది.
గుంటూరు జిల్లాలో ఘోరం, బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నం- సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన బాలిక
గుంటూరు జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. నిందితుడి చర్యలను బాలిక సెల్‌ఫోన్ లో రికార్డు చేసింది. ఆ రికార్డులను తల్లిదండ్రులకు చూపించింది. దీంతో తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం పరిధిలోని ఒక కాలనీలో చోటు చేసుకుంది. బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం తాడేపల్లి పట్టణం పరిధిలోని ఒక కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటికి పెదవడ్లపూడికి చెందిన నాంచారయ్య అనే వృద్ధుడు తరచూ వస్తుంటాడు. ఆదివారం కూడా అలాగే వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వ్యక్తి కుమార్తెను ఇంటి లోపలకి లాక్కెళ్లాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అయితే బాలిక తెలివిగా వ్యవహరించి అతడి నుంచి తప్పించుకుంది. అలాగే నాంచారయ్య అసభ్యకరంగా ప్రవర్తించిన చర్యలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తరువాత ఆ సెల్‌ఫోన్ రికార్డులను ఇస్తూ మొత్తం వివరించింది. దీంతో తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నాంచారయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు. పెదవడ్లపూడి నుంచి వచ్చి ప్రతిరోజు నులకపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో నాంచారయ్య తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు.
ఆయనపై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి ఆశచూపి పలువురిని లొంగదీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చర్యలు ఎన్నో చేశాడని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లను తన పేరిట రాయించుకుని, కొంతకాలం తరువాత ఖాళీ చేయించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాట్లు ఆరోపణలు ఉన్నాయి. నులకపేట, బాబూ జగ్జీవన్‌రావు కాలనీ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇలా రాయించుకున్న ఇళ్లు ఉన్నాయని చెబుతున్నారు.
చిన్నారిపై లైంగిక దాడి...20 ఏళ్ల జైలు శిక్ష
ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. నెల్లూరు జిల్లా కోడవలూరు మండలం మికిలంపేటకు చెందిన ఉప్ప రవి కుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పి.కుమార్ మంగళవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నిందితుడు రవి కుమార్ 2020 ఫిబ్రవరి 16న మధ్యాహ్నం సమయంలో తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిని మాయమాటలు చెప్పి తన ఇంటిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ బాలిక ఏడవడంతో వదిలేసి పారిపోయాడు. ఆ బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లి కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువైందని, దీంతో నిందితుడు ఉప్ప రవి కుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పి.కుమార్ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీ శైలజా రెడ్డి కేసు వాదించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు