Kodali Nani : చంద్రబాబును గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ఏపీకి వస్తారేమో?-కొడాలి నాని సెటైర్లు
08 January 2024, 22:36 IST
- Kodali Nani : చంద్రబాబు టీడీపీ సీట్లు అమ్ముకుంటున్నారని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ మాకు అవసరంలేదన్నారు. చంద్రబాబు గెలిపించేందుకు రేవంత్ ఏపీకి వస్తారేమోనని సెటైర్లు వేశారు.
కొడాలి నాని
Kodali Nani : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న కేశినేని నానిని పక్కనబెట్టి, రూ.100 కోట్లు ఇస్తానన్న వారికి సీటు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా అమ్ముకున్నారన్నారు. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుపై స్పందిస్తూ... ఎవరు ఎక్కడ పోటీ చెయ్యాలో సీఎం జగన్ చెబుతారన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సీటు మార్పు ఊహాగానాలే అన్నారు.
రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ మాకు అవసరంలేదు
పక్క రాష్ట్రాల రాజకీయాలు మాకు అవసరంలేదని కొడాలి నాని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా నియమించినప్పుడు, సీఎం జగన్ ట్వీటర్‌లో అభినందించారన్నారు. రేవంత్ రెడ్డికి జగన్ ఫోన్ చేసి అభినందించాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది కాబట్టి సీఎం జగన్ పరామర్శించడానికి హైదరాబాద్ వెళ్లారన్నారు. పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు సంబంధంలేదని కొడాలి నాని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింత ఏముందన్నారు. కావాలటే రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఏపీలో చంద్రబాబును గెలిపించడానికి రేవంత్ వస్తారేమోనని సెటైర్లు వేశారు.
జగన్ ఫోన్ చేయలేదన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్య్వూలో ఏపీ సీఎం జగన్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులు గడిచిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సీఎం జగన్ గురించి ప్రస్తావన వచ్చింది. ఏపీ సీఎం జగన్ గురించి తాను ఇలా చెప్పొచ్చో లేదో తెలియదంటూనే.. హాట్ కామెంట్స్ చేశారు. తాను సీఎం అయ్యాక జగన్ కనీసం మార్యాదపూర్వకంగా కూడా ఫోన్ చేయలేదన్నారు. సాధారణంగా కొత్తగా ముఖ్యమంత్రి అయిన వారికి పక్క రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేస్తారని, కానీ సీఎం జగన్ చేయలేదన్నారు. జగన్ తో తనకు వ్యక్తిగతంగా వైరంలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై తనకు ఆయన ఫోన్ కూడా చేయలేదని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి. తాను టీడీపీలో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ఆర్ తో కొట్లాడేవాడినని రేవంత్ రెడ్డి అన్నారు. అంతకు మించి తనకు ఆ కుటుంబంతో వైరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఏపీలో చంద్రబాబు కాస్త ఊరట లభించిందన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పలేదు.