తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Youtuber Arrest: ఉడుమును వేటాడి వండుకున్న ప్రభుత్వ ఉద్యోగి, ఆపై యూట్యూబ్‌లో అప్‌లోడ్‌.. కేసు నమోదు

Youtuber Arrest: ఉడుమును వేటాడి వండుకున్న ప్రభుత్వ ఉద్యోగి, ఆపై యూట్యూబ్‌లో అప్‌లోడ్‌.. కేసు నమోదు

27 November 2024, 10:10 IST

google News
    • Youtuber Arrest: వన్యప్రాణిని వేటాడటమే కాకుండా దానిని వండుకుని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ప్రబుద్దుడిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వన్యప్రాణి ప్రేమికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
పార్వతీపురంలో ఉడుమును వేటాడి వండిన ప్రభుత్వ ఉద్యోగి
పార్వతీపురంలో ఉడుమును వేటాడి వండిన ప్రభుత్వ ఉద్యోగి

పార్వతీపురంలో ఉడుమును వేటాడి వండిన ప్రభుత్వ ఉద్యోగి

Youtuber Arrest: ఉడుమును వేటాడటమే కాకుండా దానిని వండి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉడుమును కూర వండి ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. యూట్యూబ్‌లో లైక్‌ల కోసం ఈ పనిచేసినట్టు గుర్తించారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో ఓ వ్యక్తి నెమలి కూర వండిన వీడియో కూడా ఇలాగే కలకలం రేపింది.

పార్వతీపురంలో ఉడుము కూర వండిన, వీడియోను యూట్యూబ్‌లో పెట్టిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని బండిదొరవలస గ్రామానికి చెందిన సీమల నాగేశ్వరరావు గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా వీడియోలు చిత్రీకరించి వాటిని యూ ట్యూబ్‌లో పెట్టేవాడు. ఈ క్రమంలో గత నెలలో బండిదొరవలస గ్రామానికి చెందిన ఎ. నానిబాబుతో కలిసి స్థానిక అడవిలో ఉడుమును పట్టుకున్నారు.

ఉడుము ఎలా కూర వండుతారో వివరిస్తూ వీడియో చేసి, యూట్యూబ్ లో పెట్టారు. దీనిపై వన్యప్రాణి ప్రేమికులు అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. స్టేట్ యానిమల్ ఫౌండేషన్ చెందిన గౌతమ్ నాగేశ్వరరావు, నానిబాబులపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పార్వతీపురం రేంజ్ అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని, వన్యప్రాణుల్ని చంపినా, వాటిని కొనుగోలు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు. సబ్ డీఎఫ్ఎ సంజయ్, రేంజ్ అధికారి రామ్నరేష్ మంగళవారం తెలిపారు.

సిరిసిల్లలో నెమలి కూర…

వన్యప్రాణుల్ని వేటాడి వంట చేసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. కొద్ది నెలల క్రితం తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఒక యూట్యూబర్ నెమలి కూరను ఎలా వండాలో చూపించి కటకటాల పాలయ్యాడు. నెమలిని చంపి తిన్నందుకు కటకటాల పాలయ్యాడు. .

నెమలి కూరను తింటున్నట్టు వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చూసిన కొంతమంది అధికారులకు కంప్లైంట్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి అతని గ్రామానికి వెళ్లి ఇంటిపై దాడి చేశారు. అతని ఇంట్లో ఇంకా కూర మిగిలి ఉండడం గమనార్హం. ఆ కూర నెమలికి చెందిందో కాదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు.

పోలీస్ కేసు కావడంతో యూట్యూబ్ ఛానల్ నుండి నిందితుడు వీడియోను తీసివేశారు. వీడియోను తీసివేసినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీస్ కేసు నమోదైన తర్వాత తాను నెమలిని చంపలేదని నాటు కోడిని వండి యూ ట్యూబ్ వ్యూస్‌ కోసం నెమలిగా ప్రచారం చేసినట్టు అటవీ అధికారులకు వాంగ్మూలమిచ్చాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది.

తదుపరి వ్యాసం