Tadepalli RealEstate: తాడేపల్లి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మళ్లీ మంచి రోజులు, ఐదేళ్ల తర్వాత ఊపందుకున్న లావాదేవీలు
12 October 2024, 14:47 IST
- Tadepalli RealEstate: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌లు పుంజుకుంటాయని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మళ్లీ కదలిక మొదలైంది. విజయవాడ పక్కనే ఉండటంతో లావాదేవీలు ఊపందుకున్నాయి.
తాడేపల్లి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కే తొలి అవకాశాలు
Tadepalli RealEstate: మూడు రాజధానుల ప్రకటనతో విజయవాడలో రియల్ ఎస్టేట్ మార్కెట్లన్ని గత కొన్నేళ్లుగా నేల చూపులు చూస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని ఊపులో పదేళ్ల క్రితం అంచనాలకు అందని స్థాయిలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్య భూముల ధరలు పెరిగాయి.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా నేలకు పడిపోయింది. విశాఖపట్నం రాజధాని తరలింపు ప్రకటన, అమరావతి పనులు నిలిచిపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇటీవలి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినా మునుపటి స్థాయిని ఊహించుకోవడానికి భయపడుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం పూర్తిగా నేలకొచ్చింది. గత ఐదేళ్లలో గుంటూరు, విజయవాడ మధ్య రేట్లలో సహజమైన పెరుగుదల మాత్రమే నమోదైంది. చంద్రబాబు మళ్లీ గెలిచిన తర్వాత రాజధానిలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి.
తాడేపల్లి, ఆ పరిసర గ్రామాల్లో గజం అరవై వేల నుంచి లక్ష వరకు పలుకుతోంది. అలాగే రాజధాని గ్రామాల్లో చంద్రబాబు గెలవగానే గజం ఇరవై నుంచి అరవై వేలకు ఎగబాకింది. ప్రస్తుతం విజయవాడ గుంటూరు హైవేలో ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక మొదలైంది.
తాడేపల్లిలోనే అధికం..
రాజధాని కంటే తాడేపల్లి కొత్త చుట్టుపక్కల కొత్త కొత్త విల్లా ప్రాజెక్టులు, వెంచర్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.. దీనికి భిన్నంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది.. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రియల్ మార్కెట్‌లలో సందడి నెలకొన్నా ఆ తర్వాత ఆ ఊపు తగ్గిపోయింది.
రాజధాని నిర్మాణ పనులు మొదలు కాకపోవడం, గతంలో పెట్టుబడుల వర్షం కురిపించిన ఎన్ఆర్ఐలు ఘోరంగా దెబ్బతినడం కూడా ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సంకోచించడానికి కారణంగా కనిపిస్తోంది.
రాజకీయాలు, రాజధానితో సంబంధం లేకుండా బెజవాడ గుంటూరు మధ్య చెన్నై-కోల్‌కత్తా హైవేపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గతంలో మాదిరిగా కాకపోయినా కొంత కదలిక వచ్చింది. వారధి దాటిన తర్వాత జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మాణ పనులు మొదలయ్యాయి.
మరోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో వేసే అడుగులు ఎంత త్వరగా పడతాయనే దాని కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఏడాది, రెండేళ్లలో రియల్ వ్యాపారం స్పీడందుకోవచ్చనే అంచనాలతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. రాజధాని నిర్మాణంతో ప్రభావం కాకుండా ఉండే ప్రదేశాలు, విజయవాడ-గుంటూరు నగరాలకు కనెక్టివిటీ ఉండే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
విజయవాడ నగరం నుంచి వారధి దాటిన వెంటనే అందుబాటులో ఉండటం, విజయవాడకు ఉత్తరం, తూర్పు వైపు కంటే చెన్నై జాతీయ రహదారి వైపు భూముల లభ్యత అధికంగా ఉండటంతో తాడేపల్లి ప్రాంతానికి అనువుగా మారింది.