తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Godavari Water: కృష్ణమ్మ చేరిన గోదావరి జలాలు,రెండ్రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టాకు నీటి విడుదల

Godavari Water: కృష్ణమ్మ చేరిన గోదావరి జలాలు,రెండ్రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టాకు నీటి విడుదల

Sarath chandra.B HT Telugu

08 July 2024, 14:32 IST

google News
    • Godavari Water: ఓ వైపు అంతంత మాత్రంగా వర్షాలు, మరోవైపు  అదను దాటి పోతుండటంతో   ఆందోళన చెందుతున్న కృష్ణా డెల్టా రైతంగాన్ని గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.   పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరాయి. 
పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి హారతులు ఇస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు
పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి హారతులు ఇస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి హారతులు ఇస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

Godavari Water: సాగు నీటి కోసం ఆతృతగా ఎదురు చూస్తోన్న కృష్ణా డెల్టా రైతాంగాన్ని గోదావరి జలాలు ఆదుకోనున్నాయి. గత వారం పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేస్తున్న గోదావరి జలాలు దాదాపు 200కి.మీ బిరబిరా ప్రవహిస్తూ కృష్ణానదిని చేరుకున్నాయి. విజయవాడ శివార్లలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. మరో రెండు రోజుల్లో నీటి మట్టం పెరిగితే డెల్టా కాల్వలకు నీటిని విడుదల ప్రారంభిస్తారు.

కృష్ణా బేసిన్‌లో జలాశయాలన్ని నిండుకున్న సమయంలో గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్‌‌లో కృష్ణా డెల్టాను ఆదుకుంటున్నాయి. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న 13.5లక్షల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీటిపై సందిగ్ధత ఏర్పడింది. ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించిన రైతులకు పూర్తి స్థాయిలో ఆశించినంత వర్షాలు పడలేదు. వరి సాగుపై ఆధారపడిన రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు.

ఓవైపు అంతంత మాత్రంగా ఉన్న వర్షాలు మరోవైపు డెల్టా కాల్వలలపై ఆధారపడిన రైతాంగం ఈ ఏడాది సాగుపై ఆందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గోదావరి బేసిన్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. పోలవరం దిగువున పట్టిసీమ వద్ద ఉన్న లిఫ్ట్‌లో గోదావరినీటి మట్టం 14 అడుగులకు చేరగానే పంప్ చేసే అవకాశం ఉండటంతో గత వారం మోటర్లను ఆన్ చేశారు. ప్రస్తుతం గోదావరి ఎగువున వరద ప్రవాహం పెరగడంతో పట్టిసీమవద్ద నీటి మట్టం 28అడుగులకు చేరింది. దీంతో దాదాపు 6వేల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడికాల్వ నుంచి తరలిస్తున్నారు.

పట్టిసీమ నుంచి లిఫ్ట్ ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని కుడికాల్వకు లిఫ్ట్‌ చేసే అవకాశం ఉంది. పోలవరం కుడి కాల్వల ద్వారా నీటిని మళ్లించి కృష్ణా బేసిన్‌కు తరలించడం 2015లో ప్రారంభమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-23మధ్య పట్టిసీమ లిఫ్ట్‌ను పక్కన పెట్టేశారు. గత ఏడాది కొద్ది రోజులు మాత్రమే వినియోగించారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వ చేరింది. ఈ పరిస్థితుల్లో ఎగువున ఉన్న శ్రీశైలం, సాగర్, ఆల్మట్టిలో నీరు నిండిన తర్వాత కానీ దిగువకు నీరు వచ్చే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ జలాలు వచ్చేయడంతో రైతుల్లో ఆనందం నెలకొందమి.

ఆల్మట్టి నిండుకుని, జూరాలలో కూడా నీరు నిండుకున్నాయని ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించి చంద్రబాబు ముందు చూపుతో గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల చెప్పారు.

పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి జలహారతులు ఇచ్చి గోదావరి జలాాలకు స్వాగతం పలికారు. మంత్రి నిమ్మల, ఎంపీ కేశినేని చిన్ని, ఇతర ప్రజా ప్రతినిధులు పవిత్ర సంగమం వద్ద పూజలు నిర్వహించారు.

ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి కొరత పట్టిసీమ నీటితో తీరుతుందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 8.6 అడుగుల నీటి మట్టం ఉందని,12 అడుగులకు నీరుచేరగానే డెల్టా కాల్వలకు నీటిని విడుదల చేస్తామని నిమ్మల చెప్పారు. పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టును కాపాడుకోగలుగుతున్నట్టు మంత్రి చెప్పారు. చంద్రబాబు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా రైతులు లబ్ది పొందుతున్నారని చెప్పారు.

తదుపరి వ్యాసం