తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gang Rape Accused: గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల అరెస్ట్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

Gang Rape Accused: గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల అరెస్ట్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

16 October 2024, 7:18 IST

google News
    • Gang Rape Accused: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులో ఒకరు పరారీలో ఉండగా, పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. చోరీలు, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలకు అలవాటు పడిన కరడు గట్టిన ముఠాగా గుర్తించారు. 
సామూహిక అత్యాచారం కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రత్న
సామూహిక అత్యాచారం కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రత్న

సామూహిక అత్యాచారం కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రత్న

Gang Rape Accused: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన హిందూపురం సామూహిక అత్యాచారం ఘటనలో నిందితుల్ని సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి ఆదేశాలతో 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ వివరించారు.

మంగళవారం హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న అత్యాచారం ఘటన నిందితుల అరెస్ట్ చూపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రూ.5,200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రధాన నిందితులు నాగేంద్ర, ప్రవీణ్‌లతో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు చాకలి శ్రీనివాసులు ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితుల్లో మైనర్లను చిల్డ్రన్స్‌ హోంకు తరలించారు.

సత్యసాయి జిల్లా హిందూపురం 'చిలమత్తూరు సమీపంలోని నల్లబొమ్మనపల్లిలో నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లుకు వాచ్‌మన్‌గా కర్ణాటక నుంచి వలస వచ్చిన కుటుంబం ఉంటోంది. కుటుంబంలో ఓ వ్యక్తి అతని భార్య, కుమారుడు, కోడలు, పది నెలల బాలుడితో కలిసి పేపర్‌ మిల్లు సమీపంలో నిర్మించుకున్న రేకుల షెడ్డులో ఉంటున్నారు.

అక్టోబర్ 12న తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో ఆరుగురు నిందితులు వీరు ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. మంచినీళ్లు కావాలని అడిగి ఆపై తండ్రి, కొడుకులపై దాడి చేసి కట్టేశారు. అనంతరం మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.5,200 నగదు దోచుకున్నారు. బాధితులు ఉదయం మిల్లు యజమానికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12వ తేదీ ఉదయం 8 గంటలకు చిలమత్తూరు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, 11 గంటలకల్లా నిందితులను గుర్తించినట్టు ఎస్పీ వివరించారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల అచూకీ కోసం గాలించి పట్టుకున్నట్టు వివరించారు.

అంతా స్థానికులే..

అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారంతా హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ఎ.కావడి నాగేంద్ర (38)పై ఆంధ్రా, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో 37 కేసులు ఉన్నాయి. ఇతని బంధువు, అంతర్రాష్ట్ర నేరస్థుడు దుర్గా వద్ద పనిచేస్తూ దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. మరో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌పై లేపాక్షి పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు ఉంది. మూడో నిందితుడు చావలి శ్రీనివాసులు దారిదోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. వీరు టైల్స్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న ముగ్గురు మైనర్లను తమతో కలుపుకునని దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు.

వెలుగులోకి రాని నేరాలెన్నో..

దోపిడీలు, మహిళలపై అత్యాచారాలను నిందితులు అలవాటుగా చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. హిందూపురం త్యాగరాజనగర్‌ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్‌ శ్రీనాథ్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్‌ స్టేషన్‌లో హత్య కేసు నమోదైందన్నారు.

పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడీ కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్‌ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడని, ఈ గ్యాంగ్‌ బాధితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.

తదుపరి వ్యాసం