Road Accident: ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం.. నలుగురి ప్రాణాలు బలి
29 May 2023, 7:35 IST
- Road Accident: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నాలుగు ప్రాణాలు బలైపోయాయి. ప్రకాశం జిల్లాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో విజయవాడకు చెందిన నలుగురు డెకరేషన్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
త్రిపురాంతకంలో రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి
Road Accident: మితిమీరిన వేగం, రాంగ్ రూట్‌లో కారు, ఆర్టీసి బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వేడుకల్లో డెకరేషన్ పనుల కోసం అనంతపురం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరగడంతో ఘటనా స‌్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
శుభకార్యాల్లో డెకరేషన్ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారిపై విధి పంజా విసిరింది.రోడ్డు ప్రమాదం రూపంలో నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది. విజయవాడ నుంచి అనంతపురం వెళ్లి డెకరేషన్ పనులు ముగించుకుని స్వస్థలానికి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ సంఘటన త్రిపురాంతకం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని వాంబే కాలనీకి చెందిన పిల్లి శ్రీను, సాయి(32), చంద్రశేఖర్(33), కె.శ్రీను(22)లు శుభకార్యాల్లో అలంకరణ పనులు చేసే కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు.
అనంతపురంలోని ఓ శుభకార్యానికి వెళ్లి అక్కడ అలంకరణ పనులు పూర్తి చేశారు. అనంతరం తిరిగి కారులో విజయవాడ వెళ్తున్నారు. త్రిపురాంతకం మండలం సివిల్ సప్లైస్ గోడౌన్ వద్దకు వచ్చే సరికి విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి కారును ఎదురుగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీను, సాయి, చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చికిత్స నిమిత్తం వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా కె.శ్రీను అనే యువకుడు కూడా మృతి చెందారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న కొయ్యని రాజు, అశోక్ అనే మరో ఇద్దరు వినుకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం ధాటికి కారు ఎదుటి భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
మూడు మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. స్థానికుల సాయంతో పోలీసులు అతికష్టంమీద బయటికి తీశారు. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. ప్రమాద వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను వినుకొండ ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సులు త్రిపురాంతకం ఊరి లోపలి నుంచి ప్రయాణించాల్సి ఉండగారాత్రి సమయం కావడంతో కొన్ని బస్సులు పట్టణంలోకి రాకుండానే వేగంగా బైపాస్‌లో వెళ్తున్నాయి. ఊరి బయట నుంచి వెళుతున్న కారు ఈ కోవలోనే ప్రమాదానికి గురైంది. ఆర్టీసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.