Fengal Cyclone: బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్…దక్షిణ కోస్తా, నెల్లూరుపై ఎఫెక్ట్.. సీమ జిల్లాల్లో వర్షాలు
27 November 2024, 7:49 IST
- Fengal Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా ఫెంగల్ తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఫెంగల్ ఎఫెక్ట్ పడనుంది. పంటకోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ శాఖ హెచ్చరించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
Fengal Cyclone: బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి తీవ్రవాయుగుండంగా బలపడింది. బుధవారం తుఫానుగా మారనుంది. నవంబర్ 27న తుపానుగా బలపడనుండటంతో దాని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. రేపు, ఎల్లుండి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు.
తుఫాను ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర,రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, గురు, శుక్ర,శని వారాల్లో(నవంబర్ 28 నుంచి 30తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు సాయంత్రం నుండి గంటకు 50-70కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావం ప్రధానంగా రాయలసీమ జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నవంబర్ 27, బుధవారం :
• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 28, గురువారం:
• కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 29, శుక్రవారం :
• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 30,శనివారం :
• నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రైతులకు రెవిన్యూ శాఖ అలర్ట్…
నైరుతి బంగాళాఖాతం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం రానున్న 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని రెవిన్యూ శాఖ ( విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం సగటున గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులు తుండగా, ఇది ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉందని వివరించారు. ట్రింకోమలీకి 340 కిమీ, నాగపట్నానికి 630 కిమీ, పుదుచ్చేరికి 750 కిమీ, చెన్నైకి 830 కిమీ దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని సిసోడియా పేర్కొన్నారు. వ్యవసాయదారులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సూచనలు చేయాలని రెవిన్యూ శాఖ ( విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశించారు.
*