ANU Engineering: ఏఎన్‌యూలో సెల్ఫ్ సపోర్ట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్
03 June 2024, 10:21 IST
- ANU Engineering: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సెల్ఫ్ సపోర్ట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఏఎన్‌యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ 2024
ANU Engineering: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15న ఏఎన్‌యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. జూన్ 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి జూన్ 12న ఆఖరి తేదీగా ప్రకటించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గా సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో బీటెక్+ఎంటెక్, బాచిలర్ ఆఫ్ డిజైన్ అండ్ బాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులు ఉన్నాయి.
బాచిలర్ ఆఫ్ డిజైన్ అండ్ ప్లానింగ్ కోర్సులను ఏఎన్ఐయూ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అందిస్తుంది. బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును డాక్టర్ వైఎస్ఆర్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ నిర్వహిస్తుంది.
ఏఏ కోర్సుల్లో ఎన్నెన్ని సీట్లు
1. బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో 510 సీట్లు ఉన్నాయి.
బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), సివిల్ ఇంజనీరింగ్ (సీఈ), మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంఈ), ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ&ఏంఎల్), డేటా సైన్స్ (డీఎస్), సైబర్ సెక్యూరిటీ (సీఎస్) బ్రాంచ్ ల్లో ప్రవేశాలు ఉంటాయి.
2. బీడి జైన్ అండ్ ప్లానింగ్ ప్రోగ్రామ్ లో 80 సీట్లు ఉన్నాయి.
అభ్యర్థుల కనీస అర్హత
కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు కనీస అర్హత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఇంజినీరింగ్ కోర్సులకు ఎంపిక ప్రక్రియలో ప్రవేశ పరీక్ష తప్పనిసరి. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సిలింగ్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.ప్రవేశ పరీక్షలో ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. ఇంగ్లీష్ మాధ్యమంలో వంద ప్రశ్నలు ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్ 40 ప్రశ్నలు, ఫిజిక్స్ 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రాయడానికి 90 నిమిషాల సమయం ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ?
ప్రవేశ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశా, రాజమహేంద్రవరం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,000 ఉంటుంది. అలాగే ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,200 ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12 జూన్ 2024.
ప్రవేశ పరీక్ష: 15 జూన్ 2024
ఇతర వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్ ను సందర్శించండి. https://nagarjunauniversity.ac.in/ లేదా http://anucet.in/
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)