Eluru Crime : ఆధార్ కార్డుల వంకతో తరచూ ఇంటికి, పదో తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం!
18 October 2023, 17:54 IST
- Eluru Crime : ఏలూరు జిల్లాలో పదో తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భవతి కావడంతో పెళ్లికి ఒప్పుకుని, తీరా పెళ్లికి ముందు రోజు పరారయ్యాడు.
బాలికపై వాలంటీర్ అత్యాచారం
Eluru Crime : ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు నిత్యం ఆరోపణలు చేస్తుంటాయి. ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా కొందరు వాలంటీర్ల చర్యలు ఉంటున్నాయి. ఇటీవల అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాల కేసుల్లో వాలంటీర్లు పట్టుబడుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ వాలంటీర్ నిర్వాకం వెలుగుచూసింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పరిధిలో టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికపై వాలంటీర్ నీలాపు శివకుమార్.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆధార్ కార్డులు కావాలని ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. వాలంటీర్ తరచూ తమ ఇంటికి వస్తుండడంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఆమెను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆధార్ కార్డు కావాలని ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి... తనపై అఘాయిత్యం చేశాడని బాలిక తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వాలంటీర్ నీలాపు శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ శివకుమార్‌పై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పెళ్లికి ముందు రోజు పరారీ
వాలంటీర్ నీలాపు శివకుమార్ రెండునెలల క్రితం బాలిక ఇంట్లో ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కావాలని వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తూ... పలుమార్లు అత్యాచారం చేశాడు. దసరా సెలవులు కావడంతో బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ బాలికకు వైద్యపరీక్షలు చేయగా గర్భవతి తెలయడంతో తల్లిదండ్రులకు బాలికను నిలదీశారు. దీంతో వాలంటీర్ నిర్వాకాన్ని బాలిక బయటపెట్టింది. రూ.10 వేలు ఇస్తాను, కడుపు తీయించుకోవాలని వాలంటీర్ చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. అయితే పెద్దల పంచాయితీతో బాలికను పెళ్లి చేసుకోవడానికి వాలంటీర్ ఒప్పుకున్నాడు. అయితే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా...పెళ్లికి ముందురోజు పరారయ్యాడు. వాలంటీరుకు స్థానిక నేత మద్దతు ఉండడంతో పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పదో తరగతి బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. నియోజక వర్గానికి చెందిన బాలిక(16) గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా మంచి నీరు తాగేందుకు స్టాఫ్ గదిలోకి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు ఆమెపై కన్నేశాడు. బాలికను బెదిరించి ఉపాధ్యాయుడు రెడ్డినాగయ్య ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని భయంతో మిన్నకుండి పోయింది.ఇదే అదునుగా భావించిన ఉపాధ్యాయుడు పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. శనివారం బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కదిరి డీఎస్పీ శ్రీలత అనంతపురం ఆసుపత్రిలో బాలికను పరామర్శించిన అనంతరం ఘటన వివరాలను వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం 376, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.