Tirumala : తిరుమల ఘాట్‌రోడ్డులో గజరాజుల హల్‌చల్ - భక్తులకు టీటీడీ కీలక అలర్ట్
29 June 2024, 9:01 IST
- Tirumala Latest News: తిరుమలలోని నడకదారిలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు… ఏనుగుల గంపును అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు.
తిరుమల నడకదారిలో గజరాజుల హల్‌చల్
Tirumala : తిరుమల నడకదారిలో గజరాజుల గంపు సంచరించింది. ఈ గంపులో దాదాపు 15 ఏనుగుల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏడవ మైలు సమీపంలో ఈ గంపు సంచరిస్తున్నట్లు గుర్తించారు.
ఏనుగుల గుంపు సమాచారం అందుకున్న అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు… అక్కడికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డులో శబ్ధాలు చేస్తూగజరాజులను తరిమే ప్రయత్నం చేశారు.డీప్ ఫారెస్ట్ లోకి ఏనుగుల గుంపును తరిమేసినట్లు డిఎఫ్ఓ ప్రకటన చేశారు.
ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్ట్ ఇచ్చారు. నడకదారి, మొదటి ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దారిలో వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
రుచికరమైన ఆహారాన్ని అందించాలి – టీటీడీ ఈవో
తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం ఈవో, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,… సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటళ్లతో జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులు చలేశ్వరరావు మరియు తాజ్ హోటల్స్ (జిఎం) చౌదరి, సూచనలను ఆహ్వానించినట్లు తెలిపారు. ముందుగా తిరుమల ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ మల్లిఖార్జున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు.
టీటీడీ ఐటీ విభాగం భక్తులకు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఈవో శ్యామలరావు సమీక్షించారు. అనంతరం ఆలయ సిబ్బంది, పోటు కార్మికులతో సేంద్రియ ప్రసాదాలపై సమావేశం నిర్వహించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇందులో భాగంగా యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించారు. టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.భక్తుల సూచనల మేరకు వారికి అందిస్తున్న అన్నప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
16 గంటల సమయం….
ఇక తిరుమలో చూస్తే…. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 66, 256 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం రూ. 3. 54 కోట్లుగా ఉంది. జులై 18న అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.