East Godavari News : తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, సిగరెట్లు తేలేదని బాలుడ్ని మేడ పై నుంచి తోసేసిన వాలంటీర్
26 August 2023, 18:18 IST
- East Godavari News : సిగరెట్లు తీసుకురమ్మంటే తేలేదని బాల్నుడి చితకబాది మేడపై నుంచి తోసేశాడో వాలంటీర్. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వాలంటీర్ సతీష్
East Godavari News : సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని మేడపై నుంచి తోసేశాడో యువకుడు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలో ఆ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కణువూరు గ్రామంలోని వాలంటీర్ గా పనిచేస్తున్న కల్యాణం సతీష్...అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తల్లోజు శశిధర్‌ను ఈ నెల 11న సిగరెట్లు తెచ్చి పెట్టమని అడిగాడు. అయితే బాలుడు సతీష్ చెప్పిన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది మనసులో పెట్టుకుని యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
అసలేం జరిగింది?
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు గ్రామానికి చెందిన కల్యాణం సతీష్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఆ గ్రామానికి చెందిన తల్లోజు శశిధర్ ఈ నెల 11న రోడ్డుపై వెళ్తుండగా ఆపి సిగరెట్లు తెచ్చి పెట్టమని అడిగాడు. అందుకు బాలుడు నిరాకరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న యువకుడు అదే రోజు రాత్రి గ్రామంలో బుర్ర కథ కార్యక్రమం వద్ద ఉన్న బాలుడు శశిధర్ తో పాటు మరో బాలుడిని బైక్ పై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని గ్రామంలోని సామిల్లు దగ్గర ఉన్న మేడపైకి తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లగానే వాలంటీర్ సతీష్ బాలుడిపై కోపంతో అరిచాడు. సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదని శశిధర్ ను కొట్టాడు. మరో బాలుడు కొట్టొద్దని ప్రాధేయపడగా ఇద్దర్ని కలిపికొట్టాడు. అప్పటికే సతీష్ మద్యం సేవించిన ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్ వద్ద నుంచి తప్పించుకోడానికి మేడపై నుంచి కిందికి వెళ్తుండగా శశిధర్ ను వెనుక నుంచి తన్నడంతో బాలుడు డాబాపై నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయిన శశిధర్ కదలలేని స్థితిలో ఉండగా, అక్కడ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఇద్దరు బాలురను బెదిరించాడు. కాసేపటి తర్వాత శశిధర్ ను తన బైక్ కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి దింపాడు సతీష్. గుడిమెట్లు వద్ద జారీపడిపోతే తీసుకువచ్చానని బాలుడి తల్లిని నమ్మించాడు. తీవ్రగాయాల పాలైన బాలుడిని తల్లిదండ్రులు రాజమండ్రిలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అప్పటికీ బాలుడి గాయాలు తగ్గకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడికి ఆపరేషన్ చేశారు.
వాలంటీర్ పై కేసు నమోదు
బాలుడు శశిధర్ గుడిమెట్ల మీద పడలేదని తెలుసుకున్న తండ్రి వీరబాబు సామిల్లు వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ తన కుమారుడి చెప్పు కనిపించడంతో శశిధర్‌ని ఆరాతీశాడు. దీంతో జరిగిన ఘటనను శశిధర్, మరో బాలుడు వీరబాబు తెలిపారు. వాలంటీర్ సతీష్ డాబాపై నుంచి తోసేశాడని అసలు విషయం చెప్పారు. తమను న్యాయం చేయాలని బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడికి కాలు, చెయ్యి విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయని, తమ కుమారుడి పరిస్థితి కారణమైన వాలంటీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలుడ్ని ఆరు నెలలు మంచంపైనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు వాపోయారు. గంజాయి, మద్యం మత్తులో వాలంటీర్ తమ బిడ్డను చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆరా పోలీసులు... వాలంటీర్ సతీష్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.