Indrakeeladri Dasara: అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు, తొలిరోజు బాల త్రిపుర సుందరి అలంకారం
28 August 2024, 12:49 IST
- Indrakeeladri Dasara: బెజవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ శరన్నవరాత్రుల్ని నిర్వహించనున్నారు. దేవస్థానం ఆగమ పండితులు నిర్ణయించిన తేదీల్లో దేవీ శరన్నవరాత్రి అలంకారాలను ఖరారు చేశారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఈవో రామారావు ప్రకటించారు.
అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు
Indrakeeladri Dasara: బెజవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 3వ తేదీన బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 6వ తేదీన లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీ అలంకారంలో, 8వ తేదీన మహాలక్ష్మీ దేవి గా, 9న సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. 10న దుర్గాదేవిగా, 11వ తేదీన న మహిషాసురమర్దినిగా, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా దసరా ఉత్సవాల కోసం ఆలయంలో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దేవీ శరన్నవరాత్రులకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. సగటున ప్రతి రోజు లక్షమంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 9వ తేదీన సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.