Drone Pilot Training Centre : ఏపీలో డ్రోన్ పైలట్ శిక్షణా కేంద్రం ప్రారంభం….
15 February 2023, 13:22 IST
- Drone Pilot Training Centre ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ పైలెట్ల శిక్షణ కేంద్రాన్ని స్టార్టప్ కంపెనీ డ్రోగో డ్రోన్స్ ప్రారంభించింది. ఈ నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో డ్రోన్లు ఆపరేట్ చేసే పైలట్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని డ్రోగో డ్రోన్స్ గుంటూరు జిల్లా తాడేపల్లి లో ప్రారంభించింది. కేంద్ర పౌర విమాన యాన సంస్థ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి తమ సంస్థకు ఎన్వోసి మంజూరైనట్లు డ్రోగో డ్రోన్స్ ఎం డీ యశ్వంత్ తెలిపారు.
తాడేపల్లిలో డ్రోన్స్ శిక్షణా కేంద్రం ప్రారంభం
Drone Pilot Training Centre ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల రంగంలో నవశకం ఆరంభం కానుంది. వ్యవసాయ, వ్యవసాయేతర, పారిశ్రామిక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులైన డ్రోన్ ఆపరేటర్లను తయారు చేసేందుకు స్టార్టప్ కంపెనీ డ్రోగో డ్రోన్స్ ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో డ్రోన్లను ఆపరేట్ చేసే పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకుఅవసరమైన అనుమతులు పొందిన తొలి ప్రైవేట్ సంస్థ ఇదేనని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు డ్రోన్ ఆపరేటర్ కావాలని ఆసక్తి ఉన్న వారు మెట్రో నగరాలకు వెళ్లి శిక్షణ పొందే వారని, ఇక నుంచి అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా గుంటూరు జిల్లా తాడేపల్లి లోని డ్రోగో డ్రోన్స్ సంస్థలో శిక్షణ పొందవచ్చని వివరించారు.
పదో తరగతి ఉత్తీర్ణులై, 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు డ్రోన్ ఆపరేటర్ గా శిక్ష పొందవచ్చని, డ్రోన్లను ఆపరేట్ చేసేలా శిక్షణ పొందే వారికి డి జి సి ఏ రూపొందించిన సిలబస్ ప్రకారం వారం రోజుల పాటు డ్రోగో డ్రోన్స్ శిక్షణ నిస్తున్నట్లు తెలిపారు.
తరగతి గదిలో పాఠాలను బోధించటంతో పాటు డ్రోన్లను ఫీల్డ్ లో ఆపరేట్ చేసే శిక్షణను కూడా ఇక్కడ ఇస్తారు. డ్రోన్ల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన వారితో డ్రోగో డ్రోన్స్ సిలబస్ ను రూపొందించినట్లు చెప్పారు. 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న డ్రోగో డ్రోన్స్ ఆవరణలో డ్రోన్లను ఆపరేట్ చేయాలి అనుకునే వారికి శిక్షణను ఇస్తారని వివరించారు.. దేశంలోనే డ్రోన్ ఆపరేట్ చేసే వారికి శిక్షణ ఇచ్చే ప్రముఖ సంస్థల్లో ఇది ఒకటి అని యశ్వంత్ బొంతు తెలిపారు.
ఒక్కో బ్యాచ్ లో 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా డి జి సి ఏ తమ సంస్థకు అనుమతి ఇచ్చిందని యశ్వంత్ తెలిపారు. ఈ నెల 20 నుంచి తాడేపల్లి లోని డ్రోగో డ్రోన్స్ సంస్థ ఆవరణలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని యశ్వంత్ తెలిపారు. తాడేపల్లి లో త్వరలో డ్రోన్స్ తయారీ యూనిట్ను డ్రోగో డ్రోన్స్ సంస్థ ప్రారంభించనుంది . డ్రోన్స్ విడి భాగాలను తయారు చేసే ప్రణాళికను తమ సంస్థ రూపొందించిందని, ఈ రంగంలో నూతన శకంకు తమ సంస్థ శ్రీకారం చుడుతోందని యశ్వంత్ తెలిపారు.
త్వరలో వ్యవసాయ రంగంలో రైతులు వినియోగించేందుకు అనువుగా .. అంటే విత్తనాలు చల్లటం, క్రిమి సంహారక మందులు పిచికారీ చేసే డ్రోన్ లను తయారు చేసేందుకు కూడా డ్రోగో డ్రోన్స్ ప్రణాళికను రూపొందించింది. మరో రెండు నీళ్ళల్లో ఈ డ్రోన్ల తయారీని సంస్థ ప్రారంభించనుంది.
డ్రోగో డ్రోన్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వివిధ కంపెనీలకు అవసరమైన సర్వేలు చేస్తున్నట్లు యశ్వంత్ తెలిపారు. ఎన్ఎండిసి, జిఎండిసి, ఎంఈఐఎల్, జిఏఐఎల్ , ఏపీఎస్ఎస్ఎల్ఆర్ తదితర సంస్థలకు అవసరమైన భూ సర్వేలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఏడు వేల హెక్టర్ల భూమిని తమ సంస్థ సర్వే చేసిందని యశ్వంత్ వెల్లడించారు. తమకు అప్పగించిన సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ రంగంలో అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు.