NTR Bharosa Pensions: సచివాలయ ఉద్యోగులతో ఆగస్ట్ పెన్షన్ల పంపిణీ.. మడకశిరలో పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
31 July 2024, 14:51 IST
- NTR Bharosa Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 1, 2 తేదీల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ జవహార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష
NTR Bharosa Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సత్యసాయి జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొంటారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు అందజేయనున్నారు. అనంతరం మల్బరీ నాట్లు, పట్టుపురుగుల షెడ్లు పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో మాట్లాడతారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని, ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారు.
ఉదయం ఆరింటికే పెన్షన్ల పంపిణీ..
ఏపీలో పెంచిన పెన్షన్లను ఉదయం ఆరింటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఆగస్ట్ 1వ తేదీ ఉదయం ఆరింటి నుంచి ఊరురా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని ఆగస్ట్ 1వ తేదీ గురువారం ఉదయం 6గంటలకే ప్రారంభిస్తారు. ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 64.82లక్షల ఫించన్లకు రూ.2737.41 కోట్లు విడుదల చేశారు. ఫించన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.
ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు తొలిరోజు 1వతేదీనే 96శాతం పైగా ఫించన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగష్టు నెలకు సంబంధించి 64 లక్షల 82 వేల 52 వివిధ రకాల ఫించన్ల పంపిణీకి రూ.2737.41 కోట్లను విడుదల చేయడం జరిగిందని ఈమొత్తాన్నిబుధవారం మధ్యాహ్నం లోగా డ్రా చేసేందుకు ఎల్డియంలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు స్పష్టం చేశారు.
సచివాలయ ఉద్యోగులకే బాధ్యతలు..
గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది 1వతేదీ ఇంటింటా వెళ్ళి 96 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని,2వతేదీన నూరు శాతం ఫించన్ల పంపిణీనీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఫించన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి,కడప,అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.ఆసంఘటనలకు సంబంధించి బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేసినందున తదపురి క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు.
వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఫించన్ల పంపిణీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే జిల్లా కలక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. జూలై మాసంలో ఫించన్ల పంపిణీకి సంబంధించి సర్వర్ డౌన్ కావడంతో ఆధార్ అధంటికేషన్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వాటిని అధికమించేందుకు యుఐడిఎఐ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.