Independence day: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి.. యువతకు పవన్ ప్రామీస్!
15 August 2024, 11:43 IST
- Independence day: కాకినాడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్
భవిష్యత్తు యువతరానిది.. ఆ యువతకు మాటల్లో కాకుండా చేతల్లో అండగా నిలబడి చూపిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కాకినాడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం బలంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై దాడులు చేసినా.. వేధించినా.. అఘాయిత్యాలకు పాల్పడినా.. కఠినమైన చర్యలు ఉంటాయన్న డిప్యూటీ సీఎం.. సోషల్ మీడియాలో మహిళల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
వ్యవస్థలు సరిగ్గా పనిచేసి ఉంటే..
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటే.. అవి కర్ణాటకలో దొరికాయని పవన్ వ్యాఖ్యానించారు. వాటి విలువ రూ.140 కోట్లు అని.. ఆ డబ్బు అంతా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిందన్నారు. వ్యవస్థలు సరిగ్గా పనిచేసి ఉంటే.. ఆ డబ్బుతో ఎంతోమంది విద్యార్థుల చదువుకు వినియోగించవచ్చన్నారు. పీఎంఏవై (PMAY) ద్వారా జిల్లాల్లో అక్టోబర్ నాటికి 2,500 గృహాలు పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. పీఎంఏవై 2.O ద్వారా 2025 నుంచి కేంద్రం ఇవ్వనున్న 2.5 లక్షలకు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1.5 లక్షలు జోడించి 4 లక్షల వ్యయంతో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.
పారదర్శకంగా నూతన ఇసుక విధానం..
ప్రజలకు పారదర్శకంగా నూతన ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చామన్న పవన్ కళ్యాణ్.. గ్రామాల్లో దేశ భక్తి పెంపొందించేలా.. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చేలా 34 ఏళ్ల తరవాత స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు గతంలో చెల్లిస్తున్న 100, 200 రూపాయల నిధుల స్థానంలో.. మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తున్నామని చెప్పారు.
పేదలకు భరోసా..
పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో జిల్లాలో ఇళ్లు నిర్మించుకున్న వారికి.. రూ.49 కోట్ల బకాయిలు చెల్లించేందుకు విధి, విధానాలు రూపొందిస్తున్నామని వివరించారు. 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకం ద్వారా పేదలకు అండగా నిలిచే పథకాలు తీసుకొచ్చిన నందమూరి తారకరామారావు స్ఫూర్తితో.. ఆయన పేరు మీద ఈరోజు నుంచి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం చేస్తున్నామని ప్రకటించారు.
సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహంతో..
సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం అమలుతో రాష్ట్రం ముందుకు వెళుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శనీయమైన రీతిలో దివ్యాంగులు, వితంతువులు, వృద్దులకు ఏ ఆసరా లేని 28 కేటగిరీలకు చెందిన ప్రజలకు స్వాలంబనగా నిలుస్తూ.. పెన్షన్లు గణనీయంగా పెంచామని చెప్పారు. ఒక్క కాకినాడ జిల్లాలో 2,77,594 మంది లబ్ధిదారులకు రూ.134 కోట్ల పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు.
డొక్కా సీతమ్మ పేరు మీద..
అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు మీద.. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా.. జిల్లాలో 1,253 పాఠశాలల్లో 1,02,591 మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తోందని చెప్పారు. దేశ రక్షణను దేశ ప్రజలు తమ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆ దేశాన్ని ఎవరు నాశనం చేయలేరన్న పవన్.. ఆ దేశ రక్షణను కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రజలు చేతులు కట్టుకుంటే ఆ దేశాన్ని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు.