Dana Cyclone: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న దాానా తుఫాన్,మూడు జిల్లాలకు హెచ్చరికలు, అదనపు సిబ్బంది తరలింపు
24 October 2024, 9:23 IST
- Dana Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను బలపడుతూ తీరంవైపు దూసుకొస్తుంది. తూర్పు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్ 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతున్న దానా తుఫాను
Dana Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ఉత్తరాంధ్రపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఐఎండి సూచనల ప్రకారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు.
బుధవారం సాయంత్రానికి ఒడిశాలోని పారాదీప్ కి 460 కిమీ., ఒడిశాలోని ధమ్రాకు 490 కిమీ., పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని వివరించారు. తుఫాను వాయువ్య దిశగా కదులుతూ గురువారం అక్టోబర్24 తెల్లవారుజామునకు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని వివరించారు.
తుఫాను ప్రభావంతో గురువారం కోస్తా జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం (అక్టోబర్25) తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీవ్ర తుపాను దానా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100కిమీ వేగంతో, అలాగే రేపు రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఈ జాగ్రత్తలు మరువకండి..
• భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
• ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.
• వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
• మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
• కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.