CPI Naranayana : టీడీపీ, బీజేపీ కలిస్తే వైసీపీ గెలుపు ఖాయం- సీపీఐ నారాయణ లాజిక్
18 July 2023, 19:19 IST
- CPI Naranayana : పవన్ కల్యాణ్ రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని సీపీఐ నారాయణ విమర్శించారు. టీడీపీ, బీజేపీ మధ్య పవన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని అది అంత మంచిది కాదని హితవు పలికారు.
సీపీఐ నారాయణ
CPI Naranayana : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏతో కలవడం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పవన్ నిలకడలేని వ్యక్తి అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీని దగ్గర చేసేందుకు పవన్ దళారీ అవతారమెత్తారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ కలిస్తే... ఏపీలో వైసీపీ గెలవడం ఖాయమని సీపీఐ నారాయణ జోస్యం చెప్పారు. రెండు పార్టీల్ని పవన్ కలిపితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అన్నారు. పవన్ కల్యాణ్... చేగువేరా నుంచి సావర్కర్ వైపు ప్రయాణించడం శోచనీయమన్నారు. విప్లవ వీరుడు చేగువేరా తరహాలో టీ షర్టులు వేసుకుని, సోషలిజంపై గళం విప్పిన పవన్... ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.
కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడు
ప్రత్యేక హోదా హామీని ఇప్పటి వరకూ నెరవేర్చని బీజేపీతో పవన్ కల్యాణ్ ఎలా కలుస్తారని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్... ఇప్పుడు ఎన్డీఏలో ఎలా చేరుతారని మండిపడ్డారు. పవన్ వైఖరి చూస్తుంటే రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. పవన్‌కు రాజకీయ స్థిరత్వం లేదని విమర్శించారు. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే... పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని సెటైర్లు వేశారు. ప్రాంతీయ పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న బీజేపీకి పవన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
మధ్యవర్తిత్వం మంచిది కాదు
బీజేపీ, టీడీపీ మధ్య మధ్యవర్తిత్వం చేయడం పవన్ కు అంత మంచిది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. మతవాద పార్టీ బీజేపీతో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రమాదకరమని విమర్శించారు. తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలను సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి మద్దతు పలకొద్దని పవన్ కు నారాయణ హితవు పలికారు. ఎన్డీఏ పంచన చేరిన పవన్ ప్రవర్తన బాధాకరమని సీపీఐ నారాయణ తెలిపారు.
దిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య కూటమి సమావేశం జరుగోతంది. మొత్తం 38 పార్టీలో ఈ సమావేశంలో పాల్గొన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనకు మాత్రమే పిలుపు అందింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశం కోసం దిల్లీ వెళ్లారు. ఎన్డీఏకు బయట నుంచి మద్దతు తెలుపుతున్న వైసీపీ, టీడీపీలకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం.