CPI Narayana : బాబాయి హత్య ప్రమాదమా? మూడు పెళ్లిళ్లు ప్రమాదమా?, సీఎం జగన్ దిగజారి నిందలు- సీపీఐ నారాయణ
26 July 2023, 16:51 IST
- CPI Narayana : మూడు పెళ్లిళ్లు తప్పా? బాబాయిని హత్య చేయడం తప్పా? అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. పవన్ విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కు అభ్యంతరం ఏంటని నిలదీశారు. జగన్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీపీఐ నారాయణ
CPI Narayana : ఏపీ రాజకీయాల్లో సీపీఐ నారాయణది స్పెషల్ ప్లేస్. రాజకీయాలు, సామాజిక అంశాల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటి. అది బిగ్ బాస్ షో అయినా, పవన్ కల్యాణ్ , సీఎం జగన్ పై అయినా హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు సీపీఐ నారాయణ. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనం అయ్యాయి. ఇటీవల పవన్ ఓ రాజకీయ బ్రోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారాయణ, తాజాగా పవన్ కు మద్దతుగా మాట్లాడారు. సీఎం జగన్ తో సహా మంత్రులు పవన్ మూడు పెళ్లిళ్లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం సీపీఐ నారాయణ స్పందిస్తూ... సీఎం జగన్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ మూడు పెళ్లిళ్లు తప్పా? బాబాయిని హత్య చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ప్రతిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడుతున్నారన్నారు. పవన్ విడాకులు తీసుకుని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే సీఎం జగన్ కు ఏం ఇబ్బందని ప్రశ్నించారు. బాబాయిని చంపడం తప్పు కాదని సీఎం జగన్ చెప్పగలరా? అని నారాయణ అడిగారు.
హోదా మరిచి వ్యక్తిగత దూషణలు
సీఎం జగన్ తన హోదాను మర్చిపోయి, మరింత దిగజారి మాట్లాడుతున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. రాజకీయ పరంగా విమర్శలు చేయకుండా, తరచూ వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పవన్ పై రాజకీయంగా విమర్శించేందుకు ఏం లేకపోవడంతో సీఎం జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌కు తరచూ పెళ్లాల గురించే మాట్లాడటం అలవాటుగా మారిందన్నారు. హత్యలు ప్రమాదమా? మూడు పెళ్లిళ్లు ప్రమాదమా? అనేది ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. బాబాయిని చంపడం తప్పు కాదని చెబుతారా? అని నారాయణ నిలదీశారు. పవన్ మూడు పెళ్లిళ్లు గురించి జగన్‌కు ఎందుకన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత రావడంతో దాన్ని మభ్యపెట్టేందుకు సీఎం జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
ఇటీవల పవన్ పై విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ఎన్డీఏ సమావేశానికి హాజరవ్వడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు. మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పవన్ నిలకడలేని వ్యక్తి అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఎన్డీఏకు దగ్గర చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీని దగ్గర చేసేందుకు పవన్ దళారీ అవతారమెత్తారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ కలిస్తే... ఏపీలో వైసీపీ గెలవడం ఖాయమని సీపీఐ నారాయణ జోస్యం చెప్పారు. రెండు పార్టీల్ని పవన్ కలిపితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అన్నారు. పవన్ కల్యాణ్... చేగువేరా నుంచి సావర్కర్ వైపు ప్రయాణించడం శోచనీయమన్నారు. విప్లవ వీరుడు చేగువేరా తరహాలో టీ షర్టులు వేసుకుని, సోషలిజంపై గళం విప్పిన పవన్... ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.