తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ? వెనకడుగా.. వ్యూహాత్మకమా...! గన్నవరంలో పోటీపై సందేహాలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ? వెనకడుగా.. వ్యూహాత్మకమా...! గన్నవరంలో పోటీపై సందేహాలు

Sarath chandra.B HT Telugu

05 February 2024, 9:23 IST

google News
    • Vallabhaneni Vamsi: ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేర్లలో వల్లభనేని వంశీ ఒకటి... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గన్నవరం నియోజక వర్గం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ... స్తబ్దుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే నాయకుల్లో ఒకరైన వల్లభనే(vallabhaneni)ని వంశీ (vamsi) కొద్ది నెలలుగా ఎక్కడా వినిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీని వీడిన వంశీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడానికి వైసీపీకి చక్కటి అస్త్రంగా ఉపయోగపడ్డారు.

తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో టీడీపీ Tdp ముఖ్య నాయకుల్ని ఎడాపెడ తిట్టడంతోనే వల్లభనేని వంశీ బాగా పాపులర్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu )కుటుంబం మీద వంశీ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

వైఎస్సార్సీపీ(ysrcp) లో టిక్కెట్ల కేటాయింపు, సమన్వయ కర్తల నియామకంతో హడావుడి జరుగుతున్న వేళ వల్లభనేని వంశీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నియోజక వర్గంలో ఉంటున్నా బయటకు మాత్రం పెద్దగా ఫోకస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు నాలుగు నెలలుగా వార్తల్లో కూడా వంశీ రాకపోకవడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో వంశీ పోటీ చేస్తాడా లేదా అనే సందేహం కూడా పార్టీ క్యాడర్‌లో ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం (Gannavaram) అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని గన్నవరంలో పోటీ చేయించాలని వైసీపీ భావించింది. ఆ పార్టీలో నెలకొన్నపరిణామాలతో విసిగి పోయిన పార్థసారథి టీడీపీలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. వంశీ మరోసారి పోటీ చేయించే ఉద్దేశం ఉంటే పార్థసారథి పేరు ఎందుకు తెరపైకి వస్తుందనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో ఉంది.

ఇప్పటికే ఆరు విడతల్లో వైసీపీ మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థుల్ని ప్రకటించింది. 31మంది సిట్టింగ్ అభ్యర్థులకు సీట్లు నిరాకరించడమో, మార్చడమో చేశారు. వీటిలో గన్నవరం నియోజక వర్గం లేదు. గన్నవరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా వంశీ పోటీ చేస్తారా లేదా అనే దానిపై కూడా సందేహాలు ఉన్నాయి. వంశీ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా, ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తి లేకపోవడంతో దూరంగా ఉంటున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతోనే వంశీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదనే వాదన ఉంది. ఎన్నికలపై వైసీపీ నుంచి స్పష్టమైన హామీ వస్తే చూద్దామనే ధోరణిలో ఉన్నారని సన్నిహిత వర్గాల చెబుతున్నాయి.

2009లో తొలిసారి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసిన వంశీ 12వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో తొలిసారి గన్నవరం నుంచి గెలుపొందారు. 2019లో రెండోసారి గెలిచారు. రెండోసారి టీడీపీ తరపున గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వైసీపీలోకి చేరిపోయారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ, చంద్రబాబు నాయుడును విమర్శించడానికి ఏ అవకాశం వచ్చినా వదలకుండా మాటల దాడి చేయడానికి ముందుండే వారు.

వంశీ దురుసు వైఖరితో సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత మూటగట్టు కోవడంతోనే ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. సన్నిహితులకు కూడా అందుబాటులోకి రాకపోవడం, రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో పోటీలో ఉన్నట్టా లేనట్టా అనే సందేహం అందరిలో నెలకొంది.

తదుపరి వ్యాసం