CAG Report AP: రుణాలు పెరిగిపోతున్నాయి.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై 'కాగ్' నివేదిక
24 March 2023, 15:24 IST
Financial status of AP: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను కాగ్ సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను అందజేసింది.
ఏపీ ఆర్థికస్థితిపై కాగ్ నివేదిక
CAG On Financial Status of AP: ఏపీ ఆర్థిక స్థితిగతుల( మార్చి 32, 2022)పై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించింది. ఇందులో రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు, రెవెన్యూ , రవాణా తదితర అంశాలను ప్రస్తావించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన 6,356 కోట్ల రూపాయల గ్రాంట్ మురిగిపోయిందని పేర్కొంది. గత ఏడాది పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 24,257 కోట్ల రూపాయల మేర పెరిగినట్లు తెలిపింది. బడ్జెటేతర రుణాలు 1,18,394 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు వెల్లడించింది.డిస్కమ్ లకు , నీటి పారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో 17,804 కోట్లుగా ఉన్నాయని ప్రస్తావించింది. వీటినీ బడ్జెట్ లో చూపకపోవటంతో కీలకమైన మౌలిక సదుపాయల కల్పనా నిధుల పై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైందని తెలిపింది.
:2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. 2021లో ఏపీ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించింది తద్వారా ఆర్ధిక రుణ పరిమితి పెంచుకునే ప్రయత్నం జరిగింది. 688 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్దిదారులకు ఇచ్చే ఇళ్లస్థలాలు ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉంది. బడ్జెట్ లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగ్గా అమలు కాలేదు. 3540 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రాష్ట్రం వివిధ పథకాలకు తన వాటా విడుదల చేయలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేపిటల్ వ్యయం తక్కువగా ఉంది. ఇది భౌతిక ఆస్తుల కల్పనపై ప్రభావాన్ని చూపి దీర్ఘకాల అార్ధికాభివృద్ధి కుంటుపడే అవకాశముంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 3,72,503 కోట్లుగా ఉంది. ఇందులో 90 శాతం మేర రుణాలు 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నవే. 2018 నుంచి 2022 వరకూ అంతర్గత రుణాలు 77.54 శాతం మేర పెరిగాయి. గడిచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగింది, బడ్జేటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం 92,797గా నమోదైంది" అయినట్లు వివరించింది.
వచ్చే ఏడేళ్లలో గా రాష్ట్రప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాలని కాగ్ తెలిపింది. "అమరావతి- ఎఫ్ఆర్ బీఎం చట్టం నిర్దేశించిన పరిమితి కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు 9.85 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చులు 4.25 శాతం మేర పెరిగాయి. మొత్తంగా 26,380 కోట్ల ఖర్చు చేయని మొత్తాన్ని రాష్ట్ర సంచిత నిధికి ల్యాప్స్ చేశారు. ఫలితంగా రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించేందుకు ప్రయత్నం జరిగింది. సామాజిక-ఆర్ధికాభివృద్ధి పథకాల కోసం రుణాలపై ఆధారపడకుండా అదనపు రెవెన్యూ వనరుల కోసం ప్రయత్నించాలి. ఆస్తుల కల్పన-ఆర్ధికాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాలి. ఆశించిన ప్రయోజనాలు పొందేందుకు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి. హామీలు ఇచ్చేముందు సంస్థల రుణాలు తీర్చే సామర్ధ్యాన్ని లెక్కించాల్సి ఉంది. ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండానే 2812 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఖజానా కోడ్ కు విరుద్ధంగా పీడీ ఖాతాల్లోని 11,237 కోట్ల కు గానూ 1,99,616 సర్దుబాటు బిల్లులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్ధికకోడ్ కు విరుద్దమైన ఈ లావాదేవీలను అనుమతించింది. ఆర్ధిక సంఘం గ్రాంట్లను పంచాయితీల విద్యుత్ బకాయిల పేరుతో 1351 కోట్లు మినహాయించారు. స్థానిక సంస్థలకు చెందిన నిధుల్లో ఆర్ధికశాఖ కోత విధించటం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉంది. జీపీఎఫ్ ఖాతాల నుంచి 413 కోట్ల డీఏ బకాయిలను అనుచితంగా డెబిట్ చేశారు. ఖజానా నియంత్రణను ఉల్లంఘించి సీఎఫ్ఎంఎస్ బ్యాక్ ఎండ్ ద్వారా ప్రత్యేక బిల్లులు, సర్దుబాట్లను నిలిపివేయాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ రంగ సంస్థలు 3,387 కోట్ల నష్టాల్ని చవిచూశాయి, ఏపీ డిస్కమ్ లు గణనీయమైన నష్టాలను నమోదయ్యాయి" అని కాగ్ తన అడిట్ రిపోర్టులో ప్రస్తావించింది.