తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు

Vja Police Suspensions: నందిగామలో చోరీ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ కమిషనర్‌ వేటు

Sarath chandra.B HT Telugu

23 August 2024, 7:36 IST

google News
    • Vja Police Suspensions: దొంగ సొత్తు కాజేసిన పోలీసులపై విజయవాడ సీపీ వేటు వేశారు. అపహరణకు గురైన లక్షలాది రుపాయల్లో ఆరులక్షలు నొక్కేసి మిగిలిన మొత్తాన్ని  రికవరీగా చూపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు తాను మొత్తం ఇచ్చేశానని  మొత్తుకోవడంతో  అసలు విషయం బయటపడింది. దీంతో ఐదుగురిపై వేటు పడింది. 
నందిగామలో పోలీసులు అరెస్ట్‌ చేసిన క్లీనర్ కోటేశ్వరరావు
నందిగామలో పోలీసులు అరెస్ట్‌ చేసిన క్లీనర్ కోటేశ్వరరావు

నందిగామలో పోలీసులు అరెస్ట్‌ చేసిన క్లీనర్ కోటేశ్వరరావు

Vja Police Suspensions: చోరీ సొత్తు రికవరీల పోలీసుల చేతి వాటం గురించి అప్పుడప్పుడు వినే విషయాలే అయినా విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసుల చేతివాటం అధికారుల మతిపోగొట్టింది. ఓ కేసులో ఆరు లక్షలు కాజేసి మిగిలిన సొమ్మును రికవరీగా చూపించారు. దొంగ తాను మొత్తం అప్పగించేశానని మొత్తుకోవడంతో అసలు విషయం బయటపడింది. దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ములో ఆరు లక్షల రుపాయలు పోలీసులు కొట్టేసిన వైనం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు రైతులు ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌కు ఓ లారీలో మిర్చి పంటను లోడ్‌ చేసి, మైలవరానికి చెందిన డ్రైవర్‌ షేక్‌ ఖయ్యూం ద్వారా పంపారు. ఈ వాహనానికి క్లీనర్‌గా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు వెళ్లాడు. ఛత్తీస్‌గడ్‌లో మిర్చి పంటను విక్రయించగా వచ్చిన రూ. 25 లక్షలు తీసుకుని డ్రైవర్, క్లీనర్‌లు తిరిగి ఖమ్మం బయలు దేరారు.

ఆగస్టు 21న పాల్వంచ జంక్షన్‌ వద్ద తనకు పని ఉందంటూ క్లీనర్‌ కోటేశ్వరరావు లారీ దిగి వెళ్లిపోయాడు. నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతానికి వచ్చిన తర్వాత డ్రైవర్‌ ఖయ్యూంకు అనుమానం వచ్చి చూడటంతో లారీలో ఉంచిన డబ్బు మాయమైంది. ఈ ఘటనపై వెంటనే నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టి జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద కోటేశ్వరరావును పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది చోరీ సొత్తులో రూ. 6 లక్షలు కొట్టేసి వాటాలు పంచుకున్నారు. రూ. 18.52 లక్షలు మాత్రమే నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు ఏసీపీ రవికిరణ్‌ నందిగామలో ప్రెస్‌ మీట్‌ పెట్టి చోరీ సొత్తు రూ. 18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇది తెలుసుకున్న లారీ డ్రైవర్ ఖయిం, ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డబ్బు రూ.25లక్షలు పోయిందని పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అనుమానించిన అధికారులు క్లీనర్‌ కోటేశ్వరరావును నేరుగా ప్రశ్నించారు. తాను రూ.25లక్షలు ఇచ్చేశానని నిందితుడు పేర్కొన్నాడు. దీంతో శాఖపరమైన విచారణ చేయడంతో మరో రూ.3.95 లక్షలు అప్పగించారు. మిగిలిన మొత్తం ఎవరి వద్ద ఉందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కేసులో జొన్నలగడ్డ చెక్‌పోస్టు ఏఆర్‌ ఏఎస్సై భావురశెట్టి రుద్రరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ కొలుసు నాగబాబు, కానిస్టేబుల్‌ ముతకన అరుణ్‌కుమార్‌తో పాటు సివిల్‌ కానిస్టేబుళ్లు ముచ్చు శివరామకృష్ణప్రసాద్, జంగాల సృజన కుమార్‌లను సస్పెండ్‌ చేశారు. వీరిని కూడా చోరీ కేసులో నిందితులుగా చేర్చినట్టు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.

విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో నందిగామ డివిజన్‌ పోలీసుల పనితీరుపై గతంలో కూడా పలు విమర‌్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సమీపంలో వాహనంలో ప్రత్యేక అరను ఏర్పాటు చేసి అందులో రూ.8కోట్లను తరలిస్తుండగా ప్రత్యేక బృందాలు గుర్తించి పట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి ఎన్నికల కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో అతీగతి లేదు. తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దులు ఉండే ప్రాంతంకావడంతో అక్రమంగా మద్యం, ఇసుక, గ్రావెల్, మట్టిని నందిగామ మీదుగా యథేచ్చగా తరలిస్తుంటారు. ఈ డివిజన్‌లో పనిచేసే పోలీస్ బాస్‌ల పర్యవేక్షణలోనే ఈ వ్యవహారాలు సాగుతాయనే విమర్శలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం