CM Tabs Distriburtion: నేడు అల్లూరి జిల్లాలో సిఎం జగన్ పర్యటన
21 December 2023, 6:15 IST
- CM Tabs Distriburtion: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అల్లూరి జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. విద్యార్ధులకు ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.
నేడు అల్లూరి జిల్లాలో సిఎం జగన్ పర్యటన
CM Tabs Distriburtion: రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్దే క్రమంలో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని అల్లూరి జిల్లాలో సిఎం జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్ లనుఉచితంగా పంపిణీ చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభిస్తారు.
దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ కలిగిన ట్యాబ్ లో దాదాపు రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబులతో కలిపి ఇప్పటివరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు రూ.1.305.74 కోట్లవ్యయంతో 9,52,925 ట్యాబులు అందచేశారు.
8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9,10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందచేస్తున్నారు. ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256GB కి పెంచి అందిస్తున్నారు.
ఉచిత ట్యాబ్ లలో…
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో (DUOLINGO) ఇన్ స్టాల్ చేశారు.
4 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా అందించనున్నారు. తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు కంటెంట్ రూపేణా లబ్ధి కలుగుతుంది. మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్. టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు కల్పించారు.
ట్యాబ్ లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేశారు. 3 ఏళ్ళ పాటు సంపూర్ణ వారంటీ.. ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో రిపేర్ చేస్తారు. వాటిని హెడ్మాస్టర్ కు ఇస్తే ఒక వారంలో రిపేర్ చేసైనా ఇస్తారు లేదా మార్చి వేరేదైనా ఇవ్వనున్నారు.