CM YS Jagan: విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సిఎం జగన్
20 December 2023, 13:31 IST
- CM YS Jagan: రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం జగన్ తెలిపారు. విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేస్తున్న సిఎం జగన్
CM YS Jagan: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్, క్యూఎస్ ర్యాకింగ్స్ లో టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నట్టు సిఎం జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి గరిష్టంగడా రూ.కోటి 25 లక్షల ఫీజులు చెల్లిస్తున్నామని, మిగిలిన వారికి రూ.కోటి వరకు ఫీజులు చెల్లిస్తున్నామని చెప్పారు.
జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి విడుదల చేశారు. ఈ ఏడాది 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.
విదేశాల్లో ఉన్నత విద్య కోసం 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రూ.107 కోట్లను 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేసినట్టు సిఎం జగన్ వివరించారు.
ఈ పథకంలో లబ్ది పొందిన వారిని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని తలరాతలు మారడానికి ఉపయోగించుకోవాలన్నారు. కెరీర్ లో గొప్పగా ఎదిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలన్నారు.
మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మంచి చేయాలన్నదే తన అకాంక్ష అని వివరించారు. కార్నిగిమెలన్ యూనివర్సిటీలో రూప అనే విద్యార్ధినికి 89 లక్షలు కంప్యూటర్ సైన్స్ ఫీజును చెల్లిస్తున్నట్టు తెలిపారు. సాంబశివ అనే విద్యార్ధికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు ఫీజుగా చెల్లిస్తున్నట్లు చెప్పారు. కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని అతనికి రూ. 75.87 లక్షలు ఫీజు చెల్లిస్తున్నామన్నారు.
వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్‌లో శ్రేయకు రూ.70 లక్షలు ఫీజు చెల్లిస్తున్నామని, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చిందని ఆమెకు రూ.67.50 లక్షలు ఫీజు చెల్లిస్తున్నామన్నారు. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయని వివరించారు.
సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఫీజులు ఉన్నాయని, ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ ఉంటుందని, అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారుర. .
విదేశీ విద్యా దీవెనలో లబ్ది పొందిన 408 మందిలో వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయని చెప్పారు. లబ్దిదారుల్లో ఎకనమికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారని చెప్పారు.
సివిల్స్ అభ్యర్థులకు ఆర్ధిక సాయం…
సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రోత్సహం ఇచ్చేలా మరో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు. ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్‌కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి మొత్తంగా లక్షన్నర ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా 95 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నట్లు చెప్పారు. 11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నామని వివరించారు. గవర్నమెంట్ లో శాచురేషన్, ట్రాన్స్‌పరెన్సీతో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.