తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Cbn Delhi Tour : ఏపీకి ఆర్థిక స‌హ‌కారం అందించండి - ప్ర‌ధాని మోదీకి సీఎం చంద్రబాబు విన‌తి

CM CBN Delhi Tour : ఏపీకి ఆర్థిక స‌హ‌కారం అందించండి - ప్ర‌ధాని మోదీకి సీఎం చంద్రబాబు విన‌తి

HT Telugu Desk HT Telugu

04 July 2024, 21:13 IST

google News
    • CM Chandrababu Delhi Tour Updates : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఆర్థిక స‌హ‌కారం అందించాల‌ని ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర సీఎం చంద్రబాబు కోరారు. పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు, అమరావ‌తి నిర్మాణానికి నిధులుతో పాటు వివిధ విభ‌జ‌న హామీల అమ‌లు గురించి ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. శారు.
ప్రధాని మోదీతో చంద్రబాబు
ప్రధాని మోదీతో చంద్రబాబు

ప్రధాని మోదీతో చంద్రబాబు

రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. సీఎంగా  బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత తొలిసారిగా మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం (పిఎంఓ)లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఏకాంతంగా చ‌ర్చించారు. 

ప్రధాని దృష్టికి కీలక అంశాలు :

ఈ చ‌ర్చ‌లో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు ఆమోదం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసిన మొత్తం రీయంబ‌ర్స్ చేయాల‌ని కోరారు. అలాగే పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న విభ‌జ‌న హామీల ప‌రిష్కారం అంశాల‌ను చంద్ర‌బాబు లేవ‌నెత్తారు.

 ప్ర‌ధాని మోడీ, సీఎం చంద్ర‌బాబు మధ్య రాజ‌కీయ చ‌ర్చ కూడా జ‌రిగిన‌ట్లు తెలిసింది. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితులు, కూట‌మి ప్ర‌భుత్వ పాల‌నపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్‌డీఏ ప్ర‌భుత్వాలు ఉండ‌టంతో రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ను విడుద‌ల‌ చేసేందుకు చొరవ చూపాలని  కోరారు.

పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు ఇవ్వాలిని ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు.  అమరావతి రాజధాని నగరంలో ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి సమగ్ర ఆర్థిక సహాయం. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందిచాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అవసరమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని  ప్రత్యేక సహాయం పథకం కింద అదనపు కేటాయింపుల‌పై పరిశీలన చేయాలన్నారు. బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

దుగ్గిరాజుపట్నం పోర్టు అభివృద్ధికి కేంద్రం నుంచి మద్దతుతో పాటు పలు అంశాలను చంద్రబాబు…. ప్ర‌ధాని మోడీ దృష్టి తీసుకెళ్లారు. ఈ సమావేశం చాలా సానుకూలంగా జ‌రిగింద‌ని తెలిపారు.

విభజన పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌ ఇంకా పోరాడుతూనే ఉందన్న వాస్తవాన్ని ప్రధాని మోదీ దృష్టికి సీఎం చంద్ర‌బాబు తీసుకెళ్లారు. అయితే గత ప్ర‌భుత్వ‌ తీరుతో మరింత నష్టం వాటిల్లిందని వివరించారు.   ఉత్పాదకత లేని వ్యయం, వ్యక్తిగత వినియోగం కోసం సహజ వనరులను దోపిడీ చేయడం వంటివి చేశారని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి లేదని... వృద్ధిరేటు పూర్తిగా క్షీణించిందని పేర్కొన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్, నీటి వనరులు, రోడ్లు, రాజధాని నగరం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై పెట్టుబడి లేదని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకోవలసిన చర్యలపై ప్రధాని మోదీతో చంద్ర‌బాబు చర్చించారు.

కేంద్రమంత్రులతో భేటీ….

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్‌ను వాణిజ్య భ‌వ‌న్‌లో క‌లిశారు. అక్క‌డే బ్రేక్ ఫాస్ట్ చేసి వివిధ అంశాల‌పై చ‌ర్చించారు.  ఈ భేటీలో సీఎం చంద్ర‌బాబుతో టీడీపీ కేంద్ర మంత్రులు కె.రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మాసాని చంద్ర‌శేఖ‌ర్‌, బీజేపీ కేంద్ర మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస్ వ‌ర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప‌య్యవుల కేశ‌వ్‌, రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల మంత్రి బీసీ జ‌న‌ర్థ‌న్ రెడ్డి, టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు ఉన్నారు.

అనంత‌రం కేంద్ర రోడ్డు ర‌వాణ‌, జాతీయ ర‌హదారుల మంత్రి నితీన్ గ‌డ్క‌రీతో సీఎం చంద్ర‌బాబు క‌లిశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి వివ‌రించారు. రోడ్ల మ‌రమ్మ‌త్తుల‌కు నిధులు ఇవ్వాల‌ని, అలాగే జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం వేగ‌వంతం చేయాల‌ని కోరారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయం శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను క‌లిసిన ఆయ‌న గ్రామీణాభివృద్ధికి నిధులు కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇత‌ర మౌలిక సౌక‌ర్యాల క‌ల్పన‌కు నిధులు ఇవ్వాల‌ని కోరారు.

కేంద్ర హోం, స‌హ‌కార శాఖ‌ మంత్రి అమిత్ షా క‌లిసిన చంద్రబాబు… ఏపీ, తెలంగాణ మ‌ధ్య ప‌రిష్కారం కాని విభ‌జ‌న అంశాల‌పై ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. 16వ ఆర్థిక సంఘం చైర్మ‌న్‌ అర‌వింద్ ప‌న‌గారియాను క‌లిసిన చంద్ర‌బాబు ఆర్థిక కేటాయింపుల‌పై చ‌ర్చించారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి కూడా వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం. కేంద్ర హౌషింగ్ అండ్ అర్బ‌న్ డ‌వ‌ల‌ప్‌మెంట్, విద్యుత్ శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ను క‌లిసిన‌ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎంఏవై) కింద ఇళ్లు మంజూరుపై చ‌ర్చించారు. కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వ‌న‌రుల శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీని క‌లిసిన చంద్రబాబు రాష్ట్రంలోని మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఫ్రీ అంశంపై చ‌ర్చించారు.

ఇవాళ రాత్రికి ఢిల్లీలో ఉన్న తెలుగు ఐఎఎస్‌, ఐపీఎస్, ఇత‌ర కేంద్ర స‌ర్వీస్ అధికారుల‌తో కలిసి చంద్రబాబు డిన్న‌ర్ చేస్తారు. ఈ డిన్న‌ర్‌లో 34 మంది ఐఎఎస్‌, 12 మంది రిటైర్డ్ ఐఎఎస్‌, 11 మంది ఐపీఎస్‌, 1 రిటైర్డ్ ఐపీఎస్‌, న‌లుగురు ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్‌), ఇద్ద‌రు ఐఆర్ఎస్‌, ఇద్ద‌రు ఐఎఎఎస్ అధికారులు పాల్గొంటారు. అలాగే ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఏపికి చెందిన ఎన్‌డీఎ ఎంపీలు కూడా ఉంటారు.

రేపు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఇలా..

శుక్ర‌వారం ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో పాటు వివిధ కేంద్ర మంత్రుల‌ను, నీతి ఆయోగ్ సీఈఓను క‌లుస్తారు. తొలుత ఉద‌యం 9 గంట‌ల‌కు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్ర‌మ‌ణ్యంను క‌లుస్తారు. 

ఆ త‌రువాత ఉద‌యం 10 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ అవుతారు. ఆమెతో అరగంట సేపు స‌మావేశం అవుతారు. అలాగే ఉద‌యం 11.15 గంట‌ల‌కు కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి జెపీ న‌డ్డాతో అరగంట సేపు భేటీ అవుతారు. ఉద‌యం 11.30 కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అవుతారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో 45 నిమిషాలు స‌మావేశం అవుతారు.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ స‌హాయ మంత్రి రామ్‌దాస్ అథ్వాలే, వేదంతా చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌, ఎన్‌టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్‌, నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఎఐ) చైర్మ‌న్ సంతోష్ యాద‌వ్ తో చంద్రబాబు స‌మావేశం అవుతారు. 

ఈ టూర్ లో భాగంగా జ‌ప‌నీస్ దౌత్య‌వేత్త సుజుకీ హిరోషీతో చంద్రబాబు స‌మావేశం అవుతారు. అనంత‌రం ఢిల్లీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బ‌య‌లుదేరుతారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం