తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

03 April 2023, 9:19 IST

google News
    • AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షల జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6,64,152 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. 
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,64,152మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. 3,349 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల్ని నిర్వహిస్తున్న 104 సెంటర్లలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్ధులను 9.30దాటిన తరువాత పరీక్షలకు అనుమతించమని ఇప్పటికే ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. 17, 18 తేదీల్లో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ, ఒకేషనల్‌ విద్యార్థుల పరీక్షలుంటాయి. 6,09,070 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వారిలో బాలురు 3,11,329 మంది, బాలికలు 2,97,741 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు 53,140 మంది, ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులు 1,525 మంది ఉన్నారు. వీరి కోసం 3,349 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతేడాది వరకూ ఏడు పేపర్ల విధానం అమల్లో ఉండగా, ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరుగుతున్నాయి.

సైన్స్‌లో ఫిజికల్‌ సైన్స్‌, నేచురల్‌ సైన్స్‌కు ఈసారి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పీఎస్‌, ఎన్‌ఎస్‌కు కేటాయించిన వాటిలో మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. గత ఏడాది అనుభవాలతో ఈసారి విద్యార్థులతో పాటు సెంటర్‌ సూపరింటెండెంట్‌ సహా టీచర్లెవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకుండా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రశ్నపత్రాలు లీకైతే ఎక్కడినుంచి బయటికొచ్చాయో కనిపెట్టే విధానాన్ని అమలుచేస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.

విద్యార్దులను ఉదయం 8.45 నుంచి 9.30 లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి ఉండదు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు , కెమెరాలు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ పరికరాలను పరీక్షా కేంద్రంలో తీసుకెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12.45 గంటల లోపు విద్యార్థులను బయటకు పంపరు. వాటర్‌ బాటిల్‌, పెన్‌, పెన్సిల్‌, ఇతర స్టేషనరీ మాత్రమే విద్యార్ధితో పాటు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు హాల్‌టికెట్లు చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు ప్రకటించారు. పరీక్ష సమయా­లకు విద్యార్థుల రాకపోకలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. పరీక్షలు జరిగే రోజుల్లో పది విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సరిహద్దు జిల్లాల్లో ఉండే విద్యార్ధుల కోసం ఏడు ప్రాంతీయ భాషలలో కూడా పది పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ, ఒడియా భాషల్లో కూడా పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3349 పరీక్ష కేంద్రాల్లో ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించ నున్నారు. వీటిలో 682 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా విద్యార్థులు పరీక్షలు రాయనుండగా... పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్లలో అత్యల్పంగా ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ, మాల్ ప్రాక్టీస్ ను నిరోధించడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లను అధికారులు రంగంలోకి దించారు. అదనంగా 104 పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చారు.

 

తదుపరి వ్యాసం