తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : రాయలసీమలో మేము నీరు పారిస్తే, వైసీపీ రక్తం పారిస్తోంది- చంద్రబాబు

Chandrababu : రాయలసీమలో మేము నీరు పారిస్తే, వైసీపీ రక్తం పారిస్తోంది- చంద్రబాబు

05 August 2023, 15:05 IST

google News
    • Chandrababu : వైసీపీ ప్రభుత్వం ప్రజా తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుల్లో వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి బయటపెడుతున్నందుకు తన రక్తం కళ్ల చూడాలని దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు.
చంద్రబాబు
చంద్రబాబు

చంద్రబాబు

Chandrababu : చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన రూట్ మార్చడం వల్లే ఉద్రిక్తత చోటుచేసుకుందని పోలీసులు అంటున్నారు. వైసీపీ నేతలు ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నారంటున్నారు.

వైసీపీ పాలనపై ప్రజా తిరుగుబాటు

ఈ దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. రాయలసీమలో తాము నీరు పారించాలని చూస్తుంటే, వైసీపీ రక్తం పారించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు వైసీపీ నేతల మాటలు నమ్మి పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు... తిరుపతి జిల్లా రేణిగుంటలో పర్యటించారు. అక్కడ చిత్తూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... చిత్తూరు జిల్లాలో 4,300 చెరువులు ఉన్నాయని, వీటి ఆధారంగా సుమారు 47 వేల ఎకరాల సాగు భూమికి అవకాశం ఉందన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో 1,147 ఎకరాల్లో చెరువులను ఆక్రమించారన్నారు. 75 ఎకరాల చెరువును పూడ్చి మరీ వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు.

పోలీసులు సమిధలు కావొద్దు

వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ తర్వాత అత్యధిక దోపిడీకి పాల్పడుతోంది మంత్రి పెద్దిరెడ్డి అని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులు ప్రీక్లోజర్‌ చేశారన్నారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో నీళ్లంటూ మంత్రి పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు. చాలా ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక పనులు ఆగిపోయాయన్నారు. ప్రాజెక్టుల అవినీతిపై ఆధారాలు చూపిస్తున్నందుకు తనపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే తన రక్తం కళ్ల చూడాలనుకుంటారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలో భాగమై పోలీసులు సమిధలు కావొద్దని చంద్రబాబు సూచించారు. వైసీపీ దౌర్జన్య కాండలో పోలీసులు సమిధలు కావొద్దన్నారు. కొంత మంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి పోలీసు వ్యవస్థను అపహాస్యం చేయొద్దన్నారు. ఏ జిల్లాలో తనపై జరగని దాడి ఇక్కడే ఎందుకు జరిగిందని ప్రశ్నించారు.

శ్రీకాళహస్తి, పూతలపట్టులో ఉద్రిక్తత

శ్రీకాళహస్తిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గోనున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే టీడీపీ ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీల్లో సైకో పోవాలి అనే పదానికి అధికారులు రంగులు వేస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభ జరిగే బేరివారి మండపం దగ్గర టీడీపీ, వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు ఎదురుగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పూతలపట్టు నియోజకవర్గంలోని మండల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. పూతలపట్టుల్లో వైసీపీ నేతలు టీడీపీ బ్యానర్లు చించి వేసి చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు సీఎం జగన్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, చెప్పుల మాల వేసి దగ్ధం చేశారు.

తదుపరి వ్యాసం