TDP BJP JSP Prajagalam : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ఏపీ అభివృద్ధి- ప్రధాని మోదీ
17 March 2024, 18:13 IST
- TDP BJP JSP Prajagalam Meeting Live : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడిలో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించారు.
ప్రధాని ప్రసంగంలో ఆడియో అంతరాలు
ప్రధాని ప్రసంగంలో ఆడియో అంతరాలు, పదే పదే మోరాయించిన మైకులు
పేద ప్రజల కోసమే ఎన్డీఏ సర్కార్
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇళ్లు ఇస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1.25 కోటి మందికి వైద్య సదుపాయం అందిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద సాయం అందిస్తున్నాం- ప్రధాని మోదీ
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్
ఎన్డీఏ కూటమి రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. టీడీపీ, జనసేన ఎన్డీఏ చేరాయి.ఈ కూటమి లక్ష్యం అభివృద్ధి చెందిన దేశం. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. -ప్రధాని మోదీ
ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు రాబోతున్నాయి- ప్రధాని మోదీ
‘ఎన్నికల షెడ్యూల్ నిన్ననే వచ్చింది. కోటప్పకొండ త్రిమూర్తుల ఆశీర్వాదంతో మూడోసారి ఎన్డీఏ అధికారంలో రాబోతుంది. జూన్ 4 వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 పైగా సీట్లు రాబోతున్నాయని’ ప్రధాని మోదీ అన్నారు.
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని మోదీ తెలుగు తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కార్యకర్తల అత్యుత్సాహంతో మైక్ సిస్టమ్ తరచూ ఆగిపోయింది. దీంతో ప్రధాని ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది.
జగన్ కు ఓటు వేయవద్దని సొంత చెల్లెళ్లే చెబుతున్నారు - చంద్రబాబు
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ ప్రధాని మోదీ నినాదాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే అన్నారు. మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలన్నారు. ఏపీలో ఎన్డీఏదే విజయం అన్నారు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి అన్నారు. జగన్ కు ఓటు వేయవద్దని సొంత చెల్లెళ్లే చెబుతున్నారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని జగన్ సొంత చెల్లెళ్లే ఆరోపించారు.
ఏపీని అప్పుల పాల్జేసిన ఘనత వైసీపీదే-సోము వీర్రాజు
ప్రజాగళం సభ ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. గత అయిదేళ్లుగా అవినీతి పాలన కారణంగా ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.
దేశంలో ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి, రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. అవినీతితో పాటు రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. వెనుకబడిన యూపీని అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మార్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు.
సీఎం జగన్ సారా వ్యాపారి- పవన్ కల్యాణ్
ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇసుక పేరుతో వైసీపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందం అన్నారు. అమరావతి అండగా ప్రధాని మోదీ అన్నారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి అని విమర్శించారు. ఏపీ రావాల్సిన పరిశ్రమలను వైసీపీ నేతలు తరిమేశారని ఆరోపించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
300 ఎకరాల సభాప్రాంగణం
ప్రజాగళం సభకు ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. కేవలం గంట వ్యవధిలో 300 ఎకరాల సభాప్రాంగణం నిండిపోయింది. బొప్పూడి సభా ప్రాంగణం జనజాతరలా కనిపిస్తుంది.
విద్యుత్ స్తంభాలు దిగాలని కోరిన ప్రధాని మోదీ
అభిమానులు విద్యుత్ స్తంభాలు ఎక్కడం పై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగం ఆపి విద్యుత్ స్తంభాలు దిగాలని కార్యకర్తలను కోరారు. విద్యుత్ టవర్లు దిగి పోవాలని ప్రధాని సూచించారు. పోలీసులు టవర్లు ఎక్కిన వారిని కిందకు దింపాలని కోరారు.
ఏపీ అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యం
దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు.
గత అయిదేళ్లలో ఏపీలో అభివృద్ధి శూన్యం, కేంద్రం సహకారంతోనే కొద్దిపాటి అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు.
కూటమి పంతం, వైసీపీ పాలన అంతం
ప్రజాగళం సభలో టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అయిదేళ్ల అరాచకపాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదని ఆరోపించారు. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిందన్నారు. కూటమి పంతం, వైసీపీ పాలన అంతం ఈ నినాదంతోనే ముందుకెళ్తామన్నారు.
కాసేపట్లో కీలక నేతల ప్రసంగాలు
మూడు పార్టీలో నినాదాలతో బొప్పూడి సభా ప్రాంగణం మారుమోగింది. కరతాళధ్వనులతో నేతలకు కార్యకర్తలు స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ , ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగం
- సభా ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ
- ప్రధాని మోదీ మాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 కోట్లమంది ప్రజలు
- ఏపీ పునర్నిర్మాణానికి మోదీ ఏవిధమైన భరోసా ఇస్తారోనని ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు
- ప్రజాగళం సభలో 40 నిమిషాలపాటు ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
- చెరో 15 నిమిషాల చొప్పున ప్రసంగించనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్
- ప్రజాగళం వేదికపైకి మూడు పార్టీలకు చెందిన 30 మందికి అనుమతి, ఇప్పటికే సభాప్రాంగణానికి చేరుకున్న కూటమి సీనియర్ నేతలు
భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు
బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాల కనిపిస్తున్నాయి. తమ పార్టీల జెండాలతో సభా ప్రాంగణానికి మూడుపార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా టీడీపీ, జనసేన, బీజేపీ జెండాల కనిపిస్తున్నాయి. తమ పార్టీల జెండాలతో సభా ప్రాంగణానికి మూడుపార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రానుండటంతో భారీగా కార్యకర్తలు చేరుకున్నారు.
ప్రజాగళం సభకు భారీగా చేరుకున్న జనం
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడిలో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. సభకు భారీగా ప్రజలు చేరుకున్నారు.