తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Vasati Deevena: నేడు అనంతపురంలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేయనున్న సిఎం..

Jagananna Vasati Deevena: నేడు అనంతపురంలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేయనున్న సిఎం..

HT Telugu Desk HT Telugu

26 April 2023, 7:56 IST

google News
    • Jagananna Vasati Deevena: ఇటీవల వాయిదా పడిన జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమాన్ని నేడు అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

Jagananna Vasati Deevena: రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధులకు జగనన్న వసతి దీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్ల రుపాయల నిధులను జమ చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు.

బుధవారం జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

2017 విద్యా సంవత్సరం నుండి ఉన్న బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.14,223.60 కోట్ల రుపాయల సాయం అందచేసింది.

జగనన్న వసతి దీవెన…

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి దీవెన కార్యక్రమం ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అందరికి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు.

జగనన్న విద్యా దీవెన..

నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన క్రింద ప్రతి విద్యార్ధికి భోజన, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20,000 వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

రాష్ట్రంలో విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంటర్‌ పాసై పై చదువులకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 ఉంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతిదీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి కేవలం 22,387 కి చేరిందని వివరించారు. 2022–23 నాటికి ఇంటర్‌ పాసై పై చదువులకు పోలేని విద్యార్ధుల జాతీయ సగటు 27 శాతం కాగా, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే ఉందని సర్కారు లెక్కలు చెబుతున్నాయి.

2018–19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్ధూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌), రాబోయే రోజుల్లో జీఈఆర్‌ శాతం 70కి తీసుకువెళ్ళేలా చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. 2018–19 లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది.2018–19లో 37,000 గా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కూడా గణనీయంగా పెరిగి 2021–22 నాటికి 85,000 కు చేరాయని గణంకాలు చెబుతున్నాయి. .

తదుపరి వ్యాసం