AP Teacher Transfers: ఏపీలో టీచర్ల బదిలీలు రద్దు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
06 June 2024, 14:48 IST
- AP Teacher Transfers: ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలను విద్యాశాఖ ఉన్నతాధికారులు రద్దు చేశారు. ఎన్నికల కోడ్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు బదిలీ చేసిన 1800 పోస్టింగ్‌లను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేసిన విద్యాశాఖ
AP Teacher Transfers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే పాలనా సంస్కరణలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో ఎన్నికల కోడ్ వెలువడటానికి ముందు తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖలో 1800మంది ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు దాదాపు 1800మంది ఉపాధ్యాయులను కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉపాధ్యాయుల బదిలీల కోసం భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి.
ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను చేపట్టకుండా ప్రత్యేకంగా కొందరు ఉపాధ్యాయులను మాత్రమే వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. ఈ బదిలీల వెనుక లక్షలాది రుపాయలు చేతులు మారాయని, ఈ వ్యవహారంలో మంత్రి బొత్స సత్యానారాయణతో పాటు సిఎంఓ కార్యాలయ అధికారులు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వచ్చాయి. .
ఉపాధ్యాయుల బదిలీలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో గత మార్చిలో ఇచ్చిన ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.