ట్రావెల్స్ బస్సు దగ్ధం చేసిన మావోయిస్టులు
25 April 2022, 10:46 IST
- కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి చాటుకున్నారు. కొత్తగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కొత్తూరులో ఆదివారం రాత్రి ఒడిశా నుంచి హైదరాబాద్ వెళుతోన్న బస్సుకు నిప్పు పెట్టారు.
చింతూరులో మావోయిస్టులు దగ్థం చేసిన ట్రావెల్స్ బస్సు
పోలీసు నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేత మరణానికి ప్రతీకారంగానే మావోయిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టు నేత నర్మదా క్యాన్సర్‌తో బాధపడుతూ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మావోయిస్టు దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లాకు చెందిన అల్లూరి ఉషారాణి మద్రాసు యూనివర్శిటీలో ఎంఏ చదివిన తర్వాత 80వ దశకంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. 42ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నారు. 2019లో క్యాన్సర్ బారిన పడిన నర్మదను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పోలీస్ కస్టడీలో ఉన్న నర్మదా చికిత్స పొందుతూ మరణించారు.
ఈ నేపథ్యంలో మావోస్టులు దండకారణ్యం బంద్‌కు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతం స్తంభించింది. హైదరాబాద్ వెళుతున్న ఒడిశా బస్సును రాత్రి 10:30కు మావోయిస్టులు దగ్ధం చేశారు. ప్రయాణికులను బస్సులో కిందకు దిగాల్సిందిగా హెచ్చరించినా కొందరకు వినకపోవడంతో మావోయిస్టులు దానికి నిప్పు పెట్టారు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు మంటలు అంటుకున్న బస్సు నుంచి కిందకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వారికి అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. ఘటనలో ఐదుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.
టాపిక్