తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Electricity Charges: ఏపీలో ముంచుకొస్తున్న విద్యుత్ ఛార్జీల భారం.. విపక్షాల ఆందోళన, 2022 నుంచి సర్దుబాటు ఛార్జీల వసూలు

Electricity Charges: ఏపీలో ముంచుకొస్తున్న విద్యుత్ ఛార్జీల భారం.. విపక్షాల ఆందోళన, 2022 నుంచి సర్దుబాటు ఛార్జీల వసూలు

06 November 2024, 12:38 IST

google News
    • Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల పిడుగు పడబోతుంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల రుపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు అమోదం లభించగా మరో రూ.11వేల కోట్ల వసూలుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. వెరసి రూ.17వేల కోట్ల భారాన్ని నెలవారీ బిల్లుల్లో ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. 
విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విజయవాడలో షర్మిల నిరసన
విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విజయవాడలో షర్మిల నిరసన

విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విజయవాడలో షర్మిల నిరసన

Electricity Charges: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల మోత మోగనుంది. విద్యుత్‌ ఛార్జీలు పెంచకపోయినా సర్దుబాటు ఛార్జీల పేరుతో నిర్వహణ వ్యయాలను ప్రజల నుంచి వసూలు చేసుకోడానికి డిస్కమ్‌లకు ప్రభుత్వం కొన్నేళ్లుగా అనుమతిస్తోంది. వైసీపీ హయంలో మొదలైన ట్రూ అప్ ఛార్జీల వడ్డనను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది.

ఇప్పటికే రూ. 6072 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసుకోడానికి ప్రభుత్వం అనుమతించింది. మరో 11 వేల కోట్ల రూపాయల భారం వేయడానికి నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 2023 -24 సంవత్సరంలో వినియోగించుకున్న విద్యుత్ పై ప్రతి యూనిట్ కు 50 పైసల నుండి రూ.2 50 పైసలు వరకు భారం పడుతుంది

ఏపీఈఆర్సీ ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల్లో 2022 - సంవత్సరంలో ప్రజలు వినియోగించుకున్న విద్యుత్‌కు అదనంగా ఖర్చైన మొత్తాన్ని డిస్కమ్‌లు వసూలు చేసుకోడానికి అనుమతి లభించింది. ఫలితంగా ప్రజలు యూనిట్‌కు రూ. 1.50 పైసల్ని అదనపు సర్దుబాటు చార్జీగా 15 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది.

గ్యాస్‌ సిలిండర్ల రాయితీ, విద్యుత్ బిల్లుల్లో వసూలు…

ఉచిత సిలిండర్ల పేరుతో 2500 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా విద్యుత్‌ బిల్లుల కోసం రూ.17వేల కోట్లను ప్రజల నుంచి వసూలు చేయాలనే నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో నోటిఫికేషన్ కాపీల దగ్ధం చేశారు. ఈనెల 8 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యారు.

2024 నవంబర్ నుండి 2026 జనవరి వరకు 15 నెలల పాటు ట్రూ అప్ చార్జీల వసూలు చేయడానికి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని,మరో రూ. 11 వేల కోట్ల రూపాయల నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 14వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు వద్ద నిరసన కార్యక్రమాలకు సీపీఎం పిలుపునిచ్చింది.

లాంతర్లతో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన

విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహించిన ధర్నాలో వైయస్ షర్మిల పాల్గొన్నారు. లాంతర్లు చేతపట్టి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నందుకు నిరసనగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఐదు నెలల పాలనలోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, ఇది హై ఓల్టేజీ షాక్ కాకపోతే ఏమిటి అని నిలదీశారు. నవంబర్‌ నుంచి ఆరు వేల కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారని, మరో 11వేల కోట్ల రూపాయల భారం కూడా త్వరలోనే ప్రజలపై మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, మొత్తం 17వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల పేరుతో వసూలు చేయబోతున్నారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారని, వైసీపీ ప్రభుత్వంపై ఇన్ని మాటలు మాట్లాడిన చంద్రబాబు.. నాలుగు నెలల్లోనే 17వేల కోట్ల భారం ప్రజలపై ఎలా మోపుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తే.. ప్రజలు మీకు అధికారం ఇచ్చారని, ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే.. విచారించి వారిని శిక్షించాలే గానీ, ప్రజలపై భారాలు మోపడం ఏమిటన్నారు. ఈఆర్సీ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నందున విద్యుత్ భారాలు లేకుండా చేయలేరా అని షర్మిల ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం