తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics: ఒంటరి పోరుకు బీజేపీ మొగ్గు, టీడీపీ,జనసేన వైపు సిపిఐ చూపు…

AP Politics: ఒంటరి పోరుకు బీజేపీ మొగ్గు, టీడీపీ,జనసేన వైపు సిపిఐ చూపు…

HT Telugu Desk HT Telugu

29 March 2023, 11:37 IST

google News
  • AP Politics: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై మెల్లగా క్లారిటీ వచ్చేస్తోంది. అంతా ఊహించినట్టే ప్రధాన ప్రతిపక్షాలన్ని ఏకమవుతుంటే, జనసేన వైఖరితో విసిగిపోయిన బీజేపీ ఒంటరి పోరుకు  సిద్ధమైపోయింది. 

ఒంటరి పోరుకు రెడీ అవుతున్న ఏపీ బీజేపీ
ఒంటరి పోరుకు రెడీ అవుతున్న ఏపీ బీజేపీ (HT_Print)

ఒంటరి పోరుకు రెడీ అవుతున్న ఏపీ బీజేపీ

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య పొత్తుల చిక్కులు మెల్లగా వీడిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు స్థానాలు మార్చుకుని పోటీకి సిద్ధమవుతున్నాయి. 2014నాటికి సమీకరణలకు కాస్త అటుఇటుగా రాజకీయ పార్టీలు అడుగులు పడుతున్నాయి.

బీజేపీతో పొత్తు విషయంలో జనసేన వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేసేందుకు సిద్దమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మనసులో మాట బయట పెట్టేశారు. తామేం స్వచ్ఛంద సంస్థను నడపడం లేదని, ఎన్నికల్లో గెలుపు తమకు కూడా ముఖ్యమేనని ముసుగులో గుద్దులాట లేకుండా చెప్పేశారు.

టీడీపీ, జనసేనతో సిపిఐ జర్నీ

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవ బోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిలో సిపిఎం ఉంటుందో లేదో క్లారిటీ లేదు.

మరోవైపు ప్రతిపక్షాలతో కలవడం అంటూ జరిగితే ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని నారాయణ స్పష్టం చేశారు. వీరుడు, సూరుడు అనుకున్న జగన్, కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శలు గుప్పించారు.. పోలవరం విషయంలో వాళ్ల నాన్న వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదన్న నారాయణ , తండ్రి సిద్ధాంతాలకు కూడా పంగ నామాలు పెట్టిన వ్యక్తి గా జగన్ మిగిలిపోయేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. తామేమి స్వచ్ఛంధ సంస్థను నడపడం లేదని ఎన్నికల్లో గెలుపు, అధికారం తమకు కూడా ముఖ్యమేనని చెప్పారను.

రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం సీఎం వైఎస్‌ జగన్ కు లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందని. రాష్ట్ర పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళాలన్నారు. తామంతా కలిసి విభజన హామీలు మేం సాధించుకు వస్తాం అన్నారు.

ఒంటరి పోరుకు సిద్ధమైపోయిన బీజేపీ….

ఏపీలో జనసేనతో పొత్తులో ఉందో లేదో క్లారిటీ లేక సతమతం అవుతున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవుతోంది. ఏపీలోని అన్ని నియోజక వర్గాలకు కన్వీనర్లు,కో కన్వీనర్లను నియమించాలని పార్టీ నిర్ణయించింది. పొత్తులతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలనే భావనకు ఇప్పటికే బీజేపీ నాయకులు వచ్చేశారు. యుద్ధ ప్రాతిపదికన అసెంబ్లీ నియోజక వర్గాలకు సమన్వయ కర్తలను నియమించడం ద్వారా ఏడాది ముందే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది.

జనసేన కలిసి వచ్చినా రాకున్నా ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఏపీ బీజేపీ సమాయత్తం అవుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దులు 173 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 0.85శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 137 స్థానాల్లో పోటీ చేసి 5.53శాతం ఓట్లు దక్కించుకున్న జనసేన ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరైంది. నాటి ఎన్నికల్లో జనసేనతో పాటు వామపక్షాలు కూడా పోటీ చేశారు. సిపిఐ ఏడు స్థానాల్లో, సిపిఎం ఏడు స్థానాల్లో పోటీ చేసింది.

జనసేన వైఖరి అంతు చిక్కకపోవడంతో బీజేపీ తన దారి తాను చూసుకోవాలని యోచిస్తోంది. కనీసం 147 నియోజక వర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని భావిస్తోంది. ప్రజా పోరు కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. జనసేన నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని బీజేపీ భావిస్తోంది. ఇకపై అన్ని నియోజకవర్గాల్లో సొంత కార్యక్రమాలను చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. త్వరలో చేపట్టే ప్రజా పోరు కార్యక్రమం విజయవంతం కావాలంటే నియోజక వర్గ స్థాయిలో నాయకులు బలంగా ఉండాలని భావిస్తోంది. అందుకే కన్వీనర్లను ప్రకటించేసింది.

బీజేపీని టార్గెట్‌ చేసిన వైసీపీ, టీడీపీ…

ఏపీలో బీజేపీ బలపడితే కుటుంబ పార్టీలకు స్థానం ఉండదనే ఉద్దేశంతో వైసీపీ, టీడీపీలు పథకం ప్రకారం బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.బీజేపీ యువమోర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు ''రాష్ట్ర రాజకీయాలు భాజపా చుట్టూ తిరుగుతున్నాయని . యువమోర్చా నేతలే భవిష్యత్తులో కీలక పాత్ర వహించేలా తయారు కావాలని పిలునునిచ్చారు. టీడీసీ ప్రభుత్వం రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడినా, సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై ఒక్క కేసు పెట్టలేదని విమర్శించారు.

ఏపీలో 163 శాసనసభ నియోజకవర్గాలకు భాజపా కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జాబితా విడుదల చేశారు. మిగతా నియోజకవర్గాలకు రెండో విడతలో ప్రకటించనున్నారు. తాజా కన్వీనర్లలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం