తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Updates: నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

TTD Updates: నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

HT Telugu Desk HT Telugu

07 June 2023, 10:01 IST

google News
    • TTD Updates: నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. మహారాష్ట్ర సిఎం షిండేతో పాటు దేవేంద్ర ఫడ్నవీస్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణ కోసం భూమి పూజ నిర్వహిస్తున్న పండితులు
ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణ కోసం భూమి పూజ నిర్వహిస్తున్న పండితులు

ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణ కోసం భూమి పూజ నిర్వహిస్తున్న పండితులు

TTD Updates: ముంబైలో విశాలమైన ప్రాంగణంలో శ్రీవారి ఆలయం కొలువు తీరనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని చేపడుతోంది. మరోవైపు ఆలయ నిర్మాణానికి రేమాండ్స్‌ సంస్థ ముందుకు వచ్చింది.

నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7వ తేదీ బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఉదయం 6-30 గంటల నుండి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ నిర్వహించారు.

ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో దాదాపు రూ 100 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడానికి రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు.వీలైనంత త్వరగా భక్తులకు నూతన ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.ప్రస్తుతం ముంబైలో ఉన్న టీటీడీ ఆలయం భక్తుల రద్దీకి తగినట్టుగా లేకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

జూన్ 8న జమ్మూలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న టీటీడీ ఉత్తరాదిలోని జమ్మూలో తావి- సూర్యపుత్రి నది ఒడ్డున శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించింది.

వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మాత వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శన మరో ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

జూన్ 7న బుధవారం ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, జలాధివాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన కలశ స్థాపన బింబస్థాపన అనే విగ్రహప్రతిష్ట, సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి శయనాధివాసం నిర్వహిస్తారు.

జూన్ 8న గురువారం ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు మిధున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం